అప్పు రూ. 2 లక్షలు.. వడ్డీ రూ. 18 లక్షలు..

call-money-issue-in-Vijayawada
కాల్ మనీ కంత్రీలకు విజయవాడ అడ్డాగా మారింది. వాళ్ల వేధింపులు కొత్తకాదు. మూడేళ్ల క్రితం వాళ్ల దారుణాలు వెలుగు చూడడంతో అందరూ ఉలిక్కిపడ్డారు. కాల్ మనీ కంత్రీల ఆగడాలు ఏ స్థాయిలో ఉంటాయో అప్పుడే ప్రపంచానికి తెలిసింది. కొంత గ్యాప్‌ ఇచ్చి మళ్లీ తమ ఆగడాలు మొదలు పెట్టారు. సోమ గోపాల కృష్ణమూర్తి అనే కాల్‌ నాగు… అప్పు తీసుకున్న వ్యక్తికి హార్ట్ ఎటాక్ తెప్పించాడు. అతడిని ఆసుపత్రిపాలు చేశాడు. అయినాసరే అతడిలో కనికరం లేదు. మానవత్వం అసలే లేదు. పెద్దల అండ చూసుకుని రెచ్చిపోతున్నాడనే ఆరోపణలున్నాయి.
విజయవాడ సింగ్ నగర్ ప్రాంతానికి చెందిన ఇజ్రాయిల్… గోపాల కృష్ణ మూర్తి దగ్గర 2 లక్షల అప్పు తీసుకున్నాడు. అదే అతడిపాలిట శాపంగా మారింది. వడ్డీల మీద వడ్డీలు వేసి రెండు లక్షలకు 20 లక్షలు చేశాడు. అంటే ఒక్క వడ్డీయే 18 లక్షలు. అసలు కంటే ఇది తొమ్మిదిరెట్లు ఎక్కువ. 2 లక్షలకు 18 లక్షల వడ్డీ కావాలంటే ఎన్నేళ్లు పడుతుంది. కానీ ఈ గోపాల కృష్ణమూర్తి అనే కాల్‌ నాగుకు ఇదేమీ పట్టలేదు. అప్పు ఇచ్చినప్పుడే చెక్కులు, నోట్లు రాయించుకుని వాటిని తన దగ్గర పెట్టుకున్నాడు. 20 లక్షలు చెల్లించాలంటూ ఇజ్రాయిల్ కుటుంబంపై భౌతిక దాడులకు దిగాడు. మానసికంగా వేధింపులకు గురిచేశాడు. వెంటనే కట్టకపోతే కోర్టుకు ఈడుస్తానంటూ బెదిరించాడు.
గోపాల కృష్ణ టార్చర్ భరంచలేక ఇజ్రాయిల్‌కు హార్ట్ ఎటాక్ వచ్చింది. ఇప్పుడతడు ఆసుపత్రిపాలయ్యాడు. అయితే గోపాల కృష్ణ దాడివల్లనే హార్ట్ ఎటాక్ వచ్చిందని ఆరోపిస్తోంది ఇజ్రాయిల్ భార్య రత్నకుమారి.
తమకు జరిగిన అన్యాయంపై పోలీసులను ఆశ్రయించింది ఇజ్రాయిల్ కుటుంబం. ఈ నెల 6న సీపీ ఆఫీస్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్లారు. కానీ పోలీసులు తమకు న్యాయం చేయడానికి ప్రయత్నించకపోగా, బయట సెటిల్మెంట్ చేసుకోవాలంటున్నారని బాధితుడి భార్య ఆవేదన వ్యక్తం చేస్తోంది.
అవసరం ఉన్నవాళ్లకు వడ్డీలకు డబ్బివ్వడం, అసలుకంటే పదుల రెట్లు వడ్డీ వేయడం, కట్టలేకపోతే ఆస్తులు కబ్జా చేయడం ఇదే కాల్‌ మనీ వ్యాపారుల దందా. వీళ్ల ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. బాకీ కట్టడానికే నానా తంటాలు పడుతున్న ఇజ్రాయిల్‌… హార్ట్ ఎటాక్‌తో ఆసుపత్రిపాలయ్యాడు. భౌతికంగా, శారీరకంగా టార్చర్ పెట్టడం వల్లనే హార్ట్ ఎటాక్ వచ్చిందని ఇజ్రాయిల్ భార్య రత్నకుమారి ఆరోపిస్తోంది. మరి ఇప్పుడా ఖర్చులన్నీ ఎవరు భరిస్తారు? పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదు? ఇవన్నీ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారాయి.