అందుకోసమే జగన్ బీజేపీతో లాలూచీ పడ్డారు

chandrababu-comments-on-center

ఏపీ అభివృద్ధిని అడ్డుకునేందుకు విపక్షాలు కుట్రలు చేస్తున్నాయని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. కేసుల కోసం బీజేపీతో వైసీపీ లాలూచీ పడిందన్నారు. విభజన హామీలు అమలు చేయడంలో మోడీ సర్కార్ విఫలమైందన్న చంద్రబాబు.. రాజీలేని పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. టీడీపీ పాలనకు 1500 రోజులు పూర్తైన సందర్భంగా గుంటూరు జిల్లాలో గ్రామదర్శినికి శ్రీకారం చుట్టారాయన.

విభజన హామీలు సాధించడానికి కేంద్రంపై అలుపెరగని పోరాటం చేస్తూనే… ఈ నాలుగేళ్లలో సాధించిన విజయాలు, అమలవుతున్న పథకాలను ఏపీ సర్కార్‌ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తోంది. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా కొల్లూరులో సీఎం చంద్రబాబు గ్రామదర్శిని ప్రారంభించారు. సమగ్ర ప్రణాళికలతో..పారదర్శకతతో అభివృద్ధిలో దేశానికే ఏపీ ఆదర్శంగా నిలిచిందన్న సీఎం.. ప్రజలు సహకరిస్తే మరిన్ని అద్భుతాలు సాధిస్తామని స్పష్టం చేశారు.
..
అటు… నాలుగేళ్లుగా విభజన హామీలు అమలు చేస్తారని చూసినా… న్యాయం జరగకపోవడంతో కేంద్రం నుంచి బయటికి వచ్చామన్నారు చంద్రబాబు. విభజన హామీల అమల్లో మోడీ సర్కార్ విఫలమైందని ఆరోపించారు. గట్టిగా అడిగితే.. కుట్రలకు తెరలేపారని మండిపడ్డారు. అమిత్ షా స్క్రిప్టులతో ప్రతిపక్ష పార్టీలు ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నాయన్న చంద్రబాబు.. కేసుల కోసమే బీజేపీతో వైసీపీ లాలూచీ పడిందని ఆరోపించారు.

మరోవైపు.. సీఎం చంద్రబాబు వేమూరు నియోజకవర్గంలో పర్యటించారు. 10 లంక గ్రామాల్లో 6 వేల ఎకరాలకు సాగునీరు అందించే.. దోనెపూడిలో పోతార్లంక ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. కృష్ణా నీళ్లు రాకున్నా పట్టిసీమతో  సాగుకు నీరిస్తున్నామన్న చంద్రబాబు.. ఏడాదిలో పోలవరాన్ని పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఏపీని నెంబర్ వన్‌ చేయాలనే లక్ష్యంతోనే తాను శ్రమిస్తున్నాన్న చంద్రబాబు.. అధికారులు గ్రామాల్లో ప్రజలతో మమేకమవ్వాలని సూచించారు.