స్నేహితులే హంతకులు… సొంత బావమరిదిపై కక్ష పెట్టుకొని…

Friends-are-murderers

అర్థం లేని ఆవేశాలతో హంతకులుగా మారుతున్నారు. విచక్షణ మరిచి దగ్గరివారి ప్రాణాలే తీస్తున్నారు. మద్యం మత్తులో ఒకడు.. స్నేహితుడినే పొట్టనబెట్టుకున్నారు. సొంత బావమరిదిపై కక్ష పెట్టుకున్న బావ.. దారికాచి మరీ హత్య చేసేడు. హైదరాబాద్‌.. విజయవాడలో.. జరిగిన ఈ రెండు మర్డర్లు సంచలనం సృష్టించాయి.

హైదరాబాద్ శివారు చందానగర్‌లో జరిగిన దారుణమిది. మద్యం మత్తులో జరిగిన గొడవలో అజయ్‌ అనే యువకుడు కత్తిపోట్లకు గురై ప్రాణాలు కోల్పోయాడు. మద్యం సేవిస్తుండగా స్నేహితుల మధ్య గొడవ జరిగింది. కోపంతో సంపత్‌ అనే యువకుడు కత్తితో పొడవడంతో తీవ్రంగా గాయపడ్డాడు అజయ్. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
.
మెదక్ జిల్లాకు చెందిన అజయ్ కుమార్ లింగంపల్లిలో ఉంటూ ఫోటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. మిత్రులతో కలిసి నల్లగండ్లలో మద్యం సేవించాడు. క్యాబ్ డ్రైవర్ సంపత్‌తో గొడవ జరిగింది. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇంతలోనే ఆగ్రహంతో అజయ్‌పై సంపత్‌ కత్తితో దాడికి దిగాడు. స్థానికుల సమాచారంతో స్పాట్‌కు వచ్చిన పోలీసులు.. చావుబతుకుల మధ్య ఉన్న అజయ్‌ని ఆస్పత్రికి తరలించారు. అజయ్ మృతితో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. నమ్మకంతో తీసుకుపోయిన స్నేహితులే చంపేశారని బోరున విలపిస్తున్నారు.

అటు.. విజయవాడలో నడిరోడ్డుపై హత్య సంచలనం సృష్టించింది. సొంత చెల్లెలి భర్తే… బావమరిదిపై కత్తి దూశాడు. పట్టపగలు కత్తితో పొడిచి పరారయ్యాడు.

విజయవాడలోని BRTS రోడ్ లోకో పైలట్‌ ట్రైనింగ్‌ కాలేజీ సమీపంలో ఈ హత్య జరిగింది. చదలవాడ రాజు అనే వ్యక్తి రైల్వే ఇనిస్టిట్యూట్‌లో గేట్‌ మెన్‌ ట్రైనింగ్‌ తీసుకొవడానికి నగరానికి వచ్చారు. ఈ క్రమంలో శనివారం రోడ్డుపై వెళ్తుండగా గుర్తు తెలియని దుండగుడు పల్సర్‌ బైక్‌ మీద వచ్చి రాజుతో కాసేపు మాట్లాడాడు. అనంతరం రాజుని విచక్షణారహితంగా కత్తితో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన రాజును స్థానికులు దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. రాజు చికిత్స పొందుతూ.. చనిపోయాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. నిందితుడు తీసుకొచ్చిన బైక్‌ ఆధారంగా అతను పశ్చిమగోదావరి జిల్లా బాదంపూడికి చెందిన శేఖర్‌గా పోలీసులు గుర్తించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో రాజు బావమరిదే ఈ హత్య చేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు.