శ్రీవారి భక్తులకు శుభవార్త..

good-news-for-ttd-devoties
కలియుగ దైవం వెంకన్న దర్శనాన్ని కొన్ని రోజుల పాటు నిలిపివేసే వివాదానికి తెరపడింది. తిరుమల మహా సంప్రోక్షణ వేళ సాధరణ భక్తుల్ని స్వామివారి దర్శనానికి అనుమతించేది లేదన్న టీటీడీ ఇప్పుడు మనసు మార్చుకుంది. భక్తుల దర్శనానికి అనుమతి నిరాకరణపై రోజు రోజుకూ దేశ వ్యాప్తంగా నిరసనలు  మిన్నంటుతూ వచ్చాయి. టీటీడీ నిర్ణయాన్ని విపక్షాలు, స్వామీజీలు అంతా విమర్శించారు. దీంతో ఏపీ సీఎం చంద్రబాబే స్వయంగా రంగంలోకి దిగి టీటీడీ బోర్డుకు కొన్ని ఆదేశాలిచ్చారు. పరిమిత సంఖ్యలో అయినా సరే భక్తుల్ని అనుమతించాలని కోరారు. ఆమగశాస్త్రాల్ని అనుసరించి సంప్రోక్షణ పూర్తి చేస్తూనే.. మధ్యలో వీలైనప్పుడు భక్తులకు స్వామి దర్శనం కల్పించాలన్నారు..
ముఖ్యమంత్రే సమీక్షించి ఆదేశాలివ్వడంతో TTD ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వెంటనే అధికారులు, వేదపండితులతో మాట్లాడారు. ఆగస్టు 11 నుంచి 16 వరకూ ఈ సంప్రోక్షణ కార్యక్రమం ఉన్నందున.. ఆ కార్యక్రమంతోపాటు భక్తుల దర్శనానికి ఇబ్బంది లేకుండా ఏం చేయాలన్న దానిపై చర్చించి నిర్ణయాన్ని పునః సమీక్షించారు. సంప్రోక్షణ నిర్వహించే తేదీల్లో భక్తుల్ని ఆలయంలోకి ఏయే సమయాల్లో అనుమతించాలన్న దానిపై నిర్ణయం తీసుకునేందుకు ఈ నెల 24న టీటీడీ బోర్డు సమావేశం కాబోతోంది. సీఎం ఆదేశాల ప్రకారం ఎక్కడా ఇబ్బందులు లేకుండా అందరికీ స్వామివారిని చూసేందుకు అవకాశం ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్. రోజూ 13 వేల మందికి దర్శనం కల్పించే అవకాశం ఉందని ఆయన  చెప్పారు..
తిరుమల మహా సంప్రోక్షణ రోజుల్లో సాధరణ  భక్తుల్ని కూడా దర్శనానికి అనుమతిస్తూ నిర్ణయం తీసుకోవడం శుభ పరిణామమని స్వరూపానందేంద్రస్వామి అన్నారు. వివాదాస్పద నిర్ణయాన్ని టీటీడీ వెనక్కు తీసుకోవడాన్ని స్వాగతించారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా పాలకమండలి వ్యవహరించాలన్నారు.
ఎవరి వాదన ఎలా ఉన్నా ప్రస్తుతం అనుకుంటున్న లెక్క బట్టి చూస్తే.. 11న మహా సంప్రోక్షణకు అంకురార్పణ చేస్తారు. ఆ రోజు కాస్త ఎక్కువ సమయమే భక్తుల్ని అనుమతిచ్చేందుకు అవకాశం ఉంటుంది. 11వ తేదీ 9 గంటలపాటు దర్శనానికి వీలుంటుంది. ఇక 12వ తేదీ నుంచి 4 గంటలకు మించి దర్శనానికి అనుమతి కుదరకపోవచ్చు. 14, 15 తేదీల్లో ఐదు గంటల పాటు భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తారు. చివరిరోజయిన 16వ తేదీన 4 గంటలు మాత్రమే మలయప్ప దర్శనం దొరుకుతుంది. భక్తులకు దర్శనాల నిలిపివేత విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దని ఈవో విజ్ఞప్తి చేశారు. దీంతో వివాద సద్దుమణిగినట్టే టీటీడీ భావిస్తోంది.
- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -