తల్లి వేసుకున్న మందులు.. శిశువు ప్రాణాన్ని తీశాయి

mother-accused-of-killing-baby-with-drug-laced-breast-milk

నొప్పి తగ్గడానికి, ఏకాగ్రత లోపానికి తల్లి వేసుకున్న మందులు.. 11 నెలల ఆమె బాబు మరణానికి కారణమయ్యాయి. పెన్సిల్వేనియాలో ఏప్రిల్‌ 2న చోటుచేసుకున్న ఈ ఘటన ఇప్పుడు తల్లి మెడకు చుట్టుకుంది. అసలే బిడ్డను పోగొట్టుకున్న దుఃఖంలో ఉన్న సమంతా విట్నీ జోన్స్ అనే మహిళ ఇప్పుడు జైలులో ఉంది. ఏప్రిల్ 2న తెల్లవారుజామున బిడ్డ గుక్కపట్టి ఏడ్చాడు. డబ్బా పాలు పట్టించే ఓపిక లేక.. ఏడుపు ఆపేందుకు, రొమ్ము పాలు ఇచ్చింది విట్నీ జోన్స్. ఆ తర్వాత బాబు నిద్రపోయాడు. ఉదయం లేచి చూశాక, పసికందు ముక్కు నుంచి రక్తం, నోటి నుంచి నురగ రావడాన్ని తల్లిదండ్రులు గుర్తించారు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే బిడ్డ చనిపోయాడని డాక్టర్లు నిర్ధారించారు.

బిడ్డ మరణానికి కారణాలు ఏంటని శవపరీక్ష చేయగా విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. నొప్పులు తగ్గడానికి వాడే మెథడోన్‌, ఏకాగ్రత కోసం వాడే యాంఫిటామైన్‌, మెథాఫెటమైన్‌ ఔషధ మూలాలు బాబు రక్తంలో కనిపించాయి. తల్లి వేసుకున్న మందులు ఆమె పాలను విషంగా మార్చాయనీ, బిడ్డ ప్రాణం పోవడానికి ఇదే కారణమని పోలీసులు కేసుపెట్టారు. దీనిపై స్థానిక న్యాయస్థానం విచారణ చేపట్టింది. బిడ్డ మరణంతో జోన్స్‌ పుట్టెడు దుఃఖంతో ఉన్నారనీ.. మెథడోన్‌ వేసుకున్నా, రొమ్ముపాలు ఇవ్వొచ్చని ఆమె తరపు లాయర్ వాదనలు వినిపించారు. ఇందులో సమంతా విట్నీ జోన్స్ తప్పేమీ లేదంటున్నారు. 2012లో ఇలాంటి కేసే తెరపైకి వచ్చింది. కాలిఫోర్నియాకు చెందిన మహిళ మెథడోన్ వేసుకోవడం, ఆ తర్వాత పాలు ఇవ్వడంతో ఆమె బాబు చనిపోయాడు. దీంతో ఆమెకు ఆరేళ్ల జైలు శిక్ష పడింది.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -