వర్షాలకు కొట్టుకు వస్తున్న పాములు.. భయంతో నగర వాసులు..

Mumbai-heavy-rains
వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ముంబై నగరం తడిసి ముద్దవుతోంది. ఎక్కడికి వెళ్లడానికీ వీలు కాని పరిస్థితి ఓ పక్క అయితే, ఇంట్లో ఉన్నా వణికిపోయే పరిస్థితి మరో పక్క. వరద నీటితో పాటు చెట్లు, పుట్టలు కొట్టుకు వస్తున్నాయి. దాంతో పాటే భయంకరమైన పాములు, విషసర్పాలు కూడా కొట్టుకు వస్తూ నగర వాసుల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. 10 అడుగులు ఉన్న ఓ కొండచిలువ విరార్ ఈస్ట్ మండ్విలోని ఆది ఎంటర్ ప్రైజెస్ ఆఫీస్ ఆవరణలో ఉన్న గేటుకు అతుక్కుపోయి ఉంది. పాముని చూడగానే భయపడిపోయిన నగర వాసులు అటవీ శాఖ అధికారులకు కబురు చేయగా పాముల్ని పట్టే వాళ్లు వచ్చి తీసుకెళ్లి అడవిలో వదిలిపెట్టారు. అలాగే అంబాది రోడ్డులోని ఓ గ్యారేజీలో బైక్‌కి చుట్టుకుని ఉన్న నల్లత్రాచుని కూడా పట్టుకుని అడవిలో వదిలిపెట్టారు. అధిక వర్షాల కారణంగానే పాములు పొడిగా ఉండే ప్రాంతాల్లోకి వచ్చి చేరుతున్నాయని యానిమల్ సొసైటీ వెల్ఫేర్ ఫౌండర్ నిలేష్ బనాగీ తెలిపారు.