మా ఇంటికంటే మీ ఇల్లే బావుంది: ఇళ్లలోకి చేరుతున్న పాములు

residents-cautioned-on-snake-season
మామూలుగానే పాములు తమ నివాసాలు విడిచి ఇళ్లలోకి వస్తున్నాయి. ఇక వర్షాకాలమైతే చెప్పనక్కరలేదు. వేడిగా ఉండే ప్రాంతం కోసం వెతుకుతున్నాయి. కర్ణాటక సివిల్ డిఫెన్స్ క్విక్ రెస్పాన్స్ టీం సభ్యుడు నాగేంద్రన్ ఇళ్లలోని వారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. నగరాల్లో విస్తరిస్తున్న భవన సముదాయాల కారణంగా పాములు నివసించడానికి స్థలం లేకపోవడంతో జనావాసాల మధ్యకు  వచ్చి చేరుతున్నాయి. ఈ మధ్య కాలంలో పలు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వచ్చిన నాగుపాములను 50 వరకు పట్టుకుని అడవుల్లో వదిలేశామన్నారు.
ఇళ్లలోని ప్రతి మూల భాగాన్ని రోజూ శుభ్రపరచాలంటున్నారు. వంటగదులు, చెప్పులు పెట్టే అల్మారాలు, ఫ్రిజ్‌లు, సింక్‌లు వంటి వాటిల్లో పాములు చేరడానికి అనువైన ప్రాంతాలుగా ఎంచుకుంటున్నాయని, అందువల్ల అప్రమత్తంగా ఉండాలని నాగేంద్రన్ సూచించారు. ఓ వ్యక్తి ఇంట్లోని బకెట్‌లో పాము కనిపించింది. దీంతో ఆ ఇంటి యజమాని పాము తాగుతుందని బకెట్‌లో పాలు కూడా పోశాడు. అంతటితో ఊరుకోకుండా అగరొత్తులు వెలిగించి పాముకు పూజలు చేయడం మొదలు పెట్టారు కుటుంబసభ్యులు. ఈ మేరకు పోలీసులకు సమాచారం అందడంతో వారు నాగేంద్రకు వివరించి పాముని పట్టించారు. పాములు పాలు తాగుతాయనేది మూఢనమ్మకమని, పాలు పోస్తే అవి మరణిస్తాయని నాగేంద్రన్ అంటున్నారు.