టీడీపీ ఆఖరిపోరాటం ఇక షురూ..

tdp mps talk about 10 percent reservations
కేంద్రంతో తాడోపేడో తేల్చుకోడానికి టీడీపీ సిద్ధమైంది.. మోడీ సర్కార్‌పై మరోసారి అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చింది. విభజన హక్కుల సాధనకు అవిశ్వాస అస్త్రాన్ని సంధించింది. గత బడ్జెట్‌ సమావేవాలు ముగిసిన దగ్గర నుంచి దీక్షలతో దూకుడు చూపించిన టీడీపీ ఎంపీలు.. ఇప్పుడు పార్లమెంట్‌ సాక్షిగా పోరాటానికి సిద్ధమయ్యారు. ఇవాళ లోక్‌సభ కార్యదర్శికి ఎంపీ కేశినేని నాని కేంద్రంపై అవిశ్వాసాని తీర్మానానికి సబంధించిన నోటీసులను అందజేశారు..
ప్రస్తుతం ప్రత్యేక హోదా నినాదంతో పాటు.. విభజన హామీలపై దీక్షలు, ఆందోళనలు, నిరసనలతో ఆంధ్ర ప్రదేశ్‌ దద్దరిల్లుతూనే ఉంది. ఇక మీదట ఆ నిరసన సెగలు ఢిల్లీని నేరుగా తాకనున్నాయి. ఐదుకోట్ల ఆంధ్రుల గళమై హస్తినలో ప్రకంపనలు సృష్టిస్తామంటున్నారు టీడీపీ ఎంపీలు. బడ్జెట్ సమావేశాల మాదిరిగానే ఈ సమావేశాలు ఆద్యంతం నిరసన తెలుపుతూ ప్రత్యేక హోదాపై పోరాడాలని నిర్ణయించుకున్నారు.
ఇప్పటికే దాదాపు అన్ని పార్టీల నాయకులను టీడీపీ ఎంపీలు కలుసుకున్నారు.. నిన్న సిపిఐ పార్టీ జాతీయ కార్యదర్శి డి రాజా, సి.పి.ఎం  జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్‌ను కలిసి ఏపీకి ప్రత్యేక హోదాపై సహకారం అందించాల్సిందిగా కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాసిన లేఖను వారికి అందజేశారు. అంతకుముందు డీఎంకే నేతలను టీడీపీ ఎంపీలు కలిశారు. అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని కోరారు.
గత బడ్జెట్‌ సమావేశాల్లో.. టీడీపీ, వైసీపీతో సహా మరో నాలుగు పార్టీలు కేంద్రంపై అవిశ్వాస నోటీసులు ఇచ్చినా.. అన్నాడీఎంకే ఎంపీల ఆందోళననలను సాకుగా చూపించి సమావేశాలను వాయిదా వేస్తూ వచ్చింది కేంద్రం. పదే పదే నోటీసులు ఇచ్చినా.. చర్చకు అనుమతించకుండా.. సభను నిరవధిక వాయిదా వేసింది. ఇప్పుడు వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేయడంతో.. సింగిల్‌గా పోరాటాన్ని టీడీపీ లీడ్‌ చేయనుంది. అందుకే అవిశ్వాస పోరాటాన్ని ఇంకాస్త ఉధృతం చేయాలని నిర్ణయించింది.. ఈ సారి అవిశ్వాసంపై చర్చ జరగకపోతే సభా కార్యకలాపాలను స్తంభింపజేయాలని టీడీపీ ఎంపీలు నిర్ణయించారు.