ఆ జిల్లాలో వైసీపీ టిక్కెట్లు వీరికేనా..?

ycp-tickets-in-prakasam-distric
ప్రకాశం జిల్లాలో ప్రధాన పార్టీలు ఎన్నికల వ్యూహాలపై దృష్టి పెట్టాయి. రానున్న ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో గెలుపుగుర్రాల వేటలో పడ్డాయి. జిల్లాలో వలసల కారణంగా ఎమ్మెల్యేలను కోల్పోయిన వైసీపీ.. కొత్త ముఖాల వేటలో పడింది. మళ్లీ ఆయా నియోజకవర్గాల్లో ఎలాగైనా పాగా వేయాలన్న లక్ష్యంతో ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఇప్పటి వరకు ఉన్న ఇన్‌ఛార్జులపైనా సర్వేలు ఆధారంగా మార్పులు చేర్పులపై దృష్టి పెట్టారు జగన్. జిల్లాలో సీనియర్లకు, మాజీలకు ప్రాధాన్యమిస్తూ వారిని పార్టీలోకి తీసుకునేందుకు రంగం సిద్దం చేసింది. ఇప్పటికే కందుకూరు, గిద్దలూరుల్లో మాజీ ఎమ్మెల్యేలను ఆహ్వానించారు. కందుకూరు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి జగన్మోహన్‌రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు కూడా చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్యేలు ఉగ్రనరసింహారెడ్డి, కె.పి.కొండారెడ్డిలతోనూ వైసీపీ టచ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు పార్టీ నిర్ణయాలు, చేరికల విషయంలో స్థానికంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కందుకూరు, గిద్దలూరుల్లో ఇన్‌ఛార్జులుగా ఉన్న తూమాటి మాధవరావు, ఐవీరెడ్డిలు ప్రస్తుతం అలక వహిస్తున్నట్లు తెలుస్తోంది. దర్శిలో బాదం మాధవరెడ్డి ఇన్‌ఛార్జిగా ఉన్నా, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌ రెడ్డి పోటీలో ఉంటానంటూ సంకేతాలు ఇస్తున్నారు.  కొండేపి, అద్దంకి, సంతనూతలపాడు నియోజకవర్గాల్లోనూ మార్పులకు అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. కొండేపిలో ఇప్పుడు ఉన్న ఇన్‌ఛార్జి వరికూటి అశోక్‌బాబు విషయంలో ఓ వర్గం వారు అసంతృప్తిగా ఉన్నారు. మరో వర్గం ఆయన్నే కొనసాగించాలని కోరుతున్నారు. ఇతర నియోజకవర్గాల్లోనూ మరికొందరిని మార్చేందుకు ప్రత్యామ్నాయాలను వెతుకుతున్నారు. అర్థ, అంగ బలమే అసలైన అర్హతగా అన్వేషణ సాగిస్తున్నారు. అయితే జిల్లాస్థాయిలో కీలకమైన బాలినేని శ్రీనివాసరెడ్డి, వైవీసుబ్బారెడ్డిల మధ్య వర్గపోరు పార్టీకి సమస్యగా మారింది. నియోజకవర్గాల్లో ఎవరి సొంత వర్గాలు వారు ప్రోత్సహిస్తున్నారు. ఇది వైసీపీకి ప్రధాన సవాలుగా మారింది.
అటు టీడీపీ కూడా జిల్లాలో బలమైన నాయకులపై గురిపెట్టింది. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా సమీక్ష చేసిన అధినేత చంద్రబాబు నేతలకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. గెలుపుగుర్రాలకే టికెట్లు ఇస్తామని క్లారిటీ ఇచ్చారు. సర్వేల ఆధారంగా పార్టీకి బలంగా మారుతారనుకుంటున్న నాయకులను టీడీపీ గూటికి చేర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే జిల్లా నాయకుల్లో ఏకాభిప్రాయం వచ్చిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటామంటున్నారు. ఇందులో భాగంగా ఉగ్రనరసింహారెడ్డి సైకిల్ ఎక్కుతారని  ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. అదే జరిగితే ప్రస్తుత ఎమ్మెల్యే కదిరి బాబూరావుకు ఎలా సర్దుబాటు చేస్తారనేది సందేహంగా మారింది. ఈ విషయంపై కొద్ది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కొండారెడ్డి తో కూడా ఇరుపార్టీలు టచ్లో ఉన్నాయి. ఇప్పటికి ఉన్న సిట్టింగ్‌ స్థానాల్లో కొన్ని చోట్ల మార్పులు తప్పవని తమ్ముళ్లు భావిస్తున్నారు.
ఏపీలో పునరుత్తేజం కోసం ప్రయత్నిస్తున్న కాంగ్రెస్‌ కూడా తమ మాజీలను పార్టీవైపు తిప్పుకునేలా పావులు కదుపుతోంది. మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా కొందరు నాయకులకు ఫోన్లు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి మూడు పార్టీలు ప్రకాశం జిల్లాలో యాక్టీవ్ అయ్యాయి. రానున్న కొద్దిరోజుల్లో పార్టీల్లో భారీ మార్పులకు అవకాశం ఉంది.