కేంద్ర కేబినెట్‌‌‌లో ఏపీకి సంబంధించి కీలక నిర్ణయం

అవిశ్వాస తీర్మానానికి ముందు ఆంధ్రప్రదేశ్‌పై కేంద్రం కాస్త కరుణ చూపింది. రాష్ట్రంలో సెంట్రల్ యూనివర్శిటీ ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది. అవిశ్వాసం వేళ.. టీడీపీ స్వరాన్ని తగ్గించేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందా..? వర్షాకాల పార్లమెంట్ సమావేశాలకు నెల రోజుల ముందు నుంచి.. కేంద్ర మంత్రులు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించడం.. పక్కా వ్యూహంలో భాగమేనా?
డ్జెట్ సమావేశాల అనుభవంతో.. వర్షాకాల పార్లమెంట్ సెషన్‌కు బీజేపి పక్కాగా ప్రిపేరైనట్లు కనిపిస్తోంది. అవిశ్వాస తీర్మానాన్ని కాషాయ దళం ముందే ఊహించినట్లుంది. తీర్మానంపై చర్చ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు నిధులు సహా అనేక అంశాలపై అడిగే ప్రశ్నలకు.. లెక్కలతో సమాధాన మిచ్చేందుకు సిద్ధమైంది.
పార్లమెంట్ సమావేశాలకు ముందు జరిగిన కేబినెట్ సమావేశంలో ఆంధ్రప్రేదశ్‌కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సెంట్రల్ యూనివర్శిటీకి ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది. ఈ ఏడాది ఆగస్టు 5నుంచి అకడమిక్ సెషన్ ప్రారంభించాలని నిర్ణయించింది. సెంట్రల్ యూనివర్శిటీ ఏర్పాటుతో విద్యావకాశాలు మరింత పెరుగుతాయని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవడేకర్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆగ్రహాన్ని చల్లార్చేందుకు కేంద్రం చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి ఇస్తున్న నిధులు.. చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు తెలియజేసేలా ప్రతీ నెలా ఇద్దరు కేంద్రమంత్రులు పర్యటించేలా ప్లాన్ చేసింది. ఇటీవల కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ  పోలవరం నిర్మాణ పనులను సీఎం చంద్రబాబు నాయుడుతో కలిసి పరిశీలించారు.
ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్టు పనులు జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. పనుల్లో పురోగతి, ప్రాజెక్టు నిర్మాణంలో వినియోగిస్తున్న సాంకేతికత తదితర అంశాలపై గడ్కరీ ఆరా తీశారు. అలాగే ఓడరేవుల అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. మరో కేంద్ర మంత్రి జయప్రకాశ్ నడ్డా గుంటూరు జిల్లా మంగళగిరిలో ఎయిమ్స్‌ నిర్మాణ పనులను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో గడువుకు ముందే.. నిర్మాణం పూర్తి చేస్తామన్నారు.
కేంద్రంపై టీడీపీ చేస్తున్న విమర్శలను తిప్పి కొడుతూనే.. కేంద్రమంత్రుల పర్యటనల ద్వారా ఆంధ్రప్రదేశ్ లో బలపడాలన్నది బీజేపి వ్యూహంగా కనిపిస్తోంది.