ఫలించిన చంద్రబాబు వ్యూహం..పవన్‌కల్యాణ్‌ సారథ్యంలోని..

ఏపీకి జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటాలన్న చంద్రబాబు వ్యూహం ఫలించింది. టీడీపీ అధినేత చతురతతో… మోడీ సర్కార్‌ అవిశ్వాసానికి తలొగ్గింది. ఒక్క దెబ్బతో రాష్ట్రంలో ప్రతిపక్షాలను ఆత్మరక్షణలో పడేసిన చంద్రబాబు.. కేంద్రంలో విపక్షాలను ఎన్డీఏ సర్కార్‌కి వ్యతిరేకంగా ఒక్కటి చేశారు. దేశ రాజకీయాల్లో టీడీపీ కీలక భూమిక పోషించబోతుందన్న సంకేతాలు పంపించారు.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన అంశాల్లో తెలుగుదేశం చేపట్టిన ఆందోళన ఒక్కసారిగా పతాకస్థాయికి చేరుకొంది. సీఎం చంద్రబాబు రాజకీయ వ్యూహం ఫలించడంతో ప్రత్యేక హోదా అంశంపై జాతీయస్థాయిలో చర్చ జరగనుంది. అయితే అవిశ్వాస తీర్మానంతో ఎన్డీఏకి ఎలాంటి ప్రమాదం లేదు.
అవసరమైన మెజార్టీతో పాటు అన్నాడీఎంకే.. ఇతర పక్షాలు ఎన్డీయేకు మద్దతు ఇచ్చే అవకాశముంది. దీంతో అవిశ్వాస తీర్మానం వీగిపోవచ్చు. కానీ.. పార్లమెంటు సాక్షిగా ప్రత్యేక హోదా అంశం మళ్లీ తెరపైకి వస్తుంది. గత నాలుగేళ్లలో మోడీ ప్రభుత్వం ఏపీకి ఎంత సాయం అందించిందో.. ఏయే ప్రయోజనాలు ఇప్పటిదాకా అమలుకు నోచుకోలేదన్న విషయం ప్రధానంగా చర్చకొచ్చే అవకాశముంది.
తాజా రాజకీయ వ్యూహంలో చంద్రబాబు ఒకే దెబ్బకు నాలుగు పిట్టల్ని కొట్టారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. వైసీపీపై పైచేయి సాధించడం, రాష్ట్రంలో బీజేపీని ఏకాకి చేయడం, పవన్‌కల్యాణ్‌ సారథ్యంలోని జనసేన విమర్శలకు బదులివ్వడం, కాంగ్రెస్‌తో పాటు ఇతర పక్షాలను ఎన్డీయేకు వ్యతిరేకంగా ఒక తాటిపైకి తీసుకొని రావడం.. ఈ నాలుగు అంశాలతో దేశ రాజకీయాల్లో టీడీపీ కీలక భూమికను పోషించనుందన్న సంకేతాలు వెళ్లాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
పార్లమెంట్‌లో టీడీపీ పోరాటం భావి తరాల కోసమేనన్న విషయం అందరికీ స్పష్టం కావాలని చంద్రబాబు పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. సభ నుంచి సస్పెండ్ చేసినా వెనుకంజ వేయొద్దని.. ఎలాంటి పరిణామాలకైనా సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. పార్టీ ఎంపీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై హితభోద చేశారు.
ప్రత్యేక హోదా, విభజన సమస్యలపై సమగ్ర సమాచారాన్ని ఎంపీలకు ఇవ్వాలని ఆయన ప్రభుత్వ పెద్దలను ఆదేశించారు. తలుపులు మూసి బిల్లు ఆమోదించి నాడు ఏపీకి అన్యాయం చేశారని ఆగ్రహించిన మోడీ.. ఈ నాలుగేళ్లలో చేసిన న్యాయమేంటో నిగ్గదీయాలన్నారు. చట్టంలో ఏం చేస్తామన్నారు? నాలుగేళ్లలో ఏం చేశారు? అన్నది లెక్కలతో సహా దేశం దృష్టికి తీసుకెళ్లాలని చంద్రబాబు నిర్దేశించారు. టీడీపీ ఎంపీలకు మద్దతుగా నిలిచేందుకు ఆర్థికమంత్రి యనమలను హస్తిన వెళ్లాలని ఆదేశించారు.
మరోవైపు అవిశ్వాస తీర్మానంపై చర్చకు ఎక్కువ సమయం కేటాయించాలని టీడీపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అవిశ్వాసంపై చర్చ సమయంలో కేంద్ర ప్రభుత్వం తరపున ప్రధాని మోడీనే సమాధానం చెప్పాలన్నారు.
మొత్తానికి రాష్ట్ర విభజనతో ఏపీ తీవ్రంగా నష్టపోయిందన్న అంశాన్ని దేశప్రజల దృష్టికి తీసుకురావడంలో టీడీపీ విజయం సాధించింది. అప్పట్లో రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్‌ కూడా తప్పనిసరిగా అవిశ్వాస తీర్మానానికి మద్దతుపలికే పరిస్థితి తీసుకువచ్చింది. అవిశ్వాసం వీగిపోయే పరిస్థితులున్నప్పటికీ పార్లమెంటులో చర్చ ద్వారా రాష్ట్రానికి జరిగిన అన్యాయాలపై దేశప్రజలకు వివరించేందుకు తెలుగుదేశం సిద్ధమవుతోంది.
- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -