నేనేంటి.. నాలెవలేంటి.. నా కారునే అడ్డుకుంటారా: ఎమ్మెల్యే వీరంగం

పబ్లిక్‌కి ఆదర్శమూర్తులు అధికారంలో ఉన్న నాయకులు. ఎవరి డ్యూటీని వారు చేయనివ్వకుండా అడ్డుకుంటూ అధికారాన్ని ప్రధర్శించాలనుకుంటారు. ఎమ్మెల్యే అయిన నా కారునే ఆపేస్తారా అంటూ టోల్ ప్లాజా దగ్గర వీరంగం సృష్టించారు. కేరళ రాష్ట్రానికి చెందిన త్రిసూర్‌లోని ఇండిపెండెంట్ ఎమ్మెల్యే పీసీ జార్జ్ మంగళవారం రాత్రి తన కారులో రైల్వే స్టేషన్‌కు వెళుతున్నారు. ఈ క్రమంలో పాలియకరా టోల్ ప్లాజా దగ్గర సిబ్బంది ఎమ్మెల్యే కారుని 3 నిమిషాలపాటు ఆపేశారు. దీంతో రెచ్చిపోయిన జార్జి కారులో నుంచి డ్రైవర్, తాను దిగి బారికేడ్లను ధ్వంసం చేశారు. అక్కడి సిబ్బందితో గొడవ పడ్డారు. కారుపై ఎమ్మెల్యే అని ఉన్న స్టిక్కర్ చూసుకోలేదని టోల్ సిబ్బంది అంటున్నా వినిపించుకోలేదు సదరు ఎమ్మెల్యే. ఈ ద‌ృశ్యం అంతా సీసీటీవీలో రికార్డ్ అవడంతో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఎమ్మెల్యే వివరణ ఇచ్చుకోవలసి వచ్చింది. తనకు కోపం వచ్చిన కారణాన్ని తెలియజేస్తూ ట్రైన్ మిస్సవుతుందన్న తొందరలోనే అలా చేశానని అన్నారు. ఇంతకు ముందు కూడా జార్జి ఇలాంటి వార్తల్లో నిలిచారు. కాలు కాలిన పిల్లిలా అయిన దానికి కాని దానికి ఎమ్మెల్యే హోదాని అడ్డుపెట్టుకుని అజమాయిషీ చేస్తుంటారని స్థానికులు చెబుతున్నారు.