ఇంట్లో చోరీ.. దొంగ ఎవరనుకుంటున్నారు..

ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడంటారు. అయితే ఈ దొంగని మాత్రం పోలీసులు పట్టేశారు. మరి చెప్పింది సాక్షాత్తు కట్టుకున్న భార్యే. ఔరంగాబాద్‌లోని ఉస్మాన్ పురాకు చెందిన రాహుల్ చవాన్‌కి రుక్సానాతో 5 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఓ పాప కూడా ఉంది. ఈ మధ్య భార్యా భర్తల మధ్య తరచుగా గొడవలు వస్తున్నాయి. పెద్దలు సర్థి చెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేదు. భర్తపై ప్యామిలీ కోర్టులో కేసు కూడా పెట్టింది. దాంతో ఇద్దరూ విడిగా ఉంటున్నారు. వారం రోజుల క్రితం ఇంటికి తాళం వేసి పాపని తీసుకుని తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. వారం తరువాత తిరిగి వచ్చిన ఆమె ఇంట్లో దొంగలు విలువైన నగదుని దోచుకువెళ్లారని గుర్తించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. ఎవరిపైన అయినా అనుమానం ఉందా అని పోలీసులు అడగడంతో తన భర్తే ఈ పని చేసి ఉంటాడని చెప్పింది. పోలీసులు అతడిని అరెస్టు చేసి విచారించగా అతడే దొంగతనం చేశాడని తెలిసింది. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.