పసుపు తాడు నాకు.. పచ్చబొట్టు పేరు ఆమెదా.. భర్తని ఉతికి..

పచ్చబొట్టూ చెరిగీ పోదులే నా రాణి.. నువ్వే నా హృదయంలో ఎప్పటికీ వుంటావులే అన్నాడు. అదే అతగాడి కొంప ముంచిది. ప్రేమ ఒకరితో పెళ్లి మరొకరితోనా అని భార్యామణి భర్తని ఉతికి ఆరేసింది. తమిళనాడు కోయంబత్తూరుకు చెందిన ఓ జంటకు వారం రోజుల క్రితం వివాహం అయింది. మరి ఈ వారం రోజుల్లో గమనించుకోలేదో ఏమో ఓ రోజు ఇద్దరూ కలిసి గుడికి వెళ్లారు. దేవుని దర్శనం చేసుకు గుడి ప్రాంగణంలో ఉన్న మెట్లపై కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. భర్త చేతిని తన చేతిలోకి తీసుకున్న ఆమెకు అతడి చేయిపై ఉన్న పచ్చబొట్టు కనిపించింది. అది ఓ అమ్మాయి పేరని అర్థమైంది భార్యకి. ఎవరామె అని ఆరా తీసింది. నసుగుతూ అసలు విషయం చెప్పాడు.
తనకి ఓ గర్ల్‌ఫ్రెండ్ ఉందని ఆమె పేరు అది అని చెప్పాడు. ఇంకేముంది.. భార్యకి చిర్రెత్తుకొచ్చింది. పెళ్లికి ముందే జరిపిన ప్రేమాయణం గురించి ఎందుకు చెప్పలేదంటూ చొక్కా పడుకుని కడిగిపారేసింది. చెడామడా చెంపలు వాయించింది. ఇదంతా సినిమా చూసినట్టు చూస్తున్నారు స్థానికులు. మరికొంత మంది మొబైల్స్‌కి పని చెప్పి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు భార్య చెర నుంచి భర్తను విడిపించారు. అసలు విషయం ఏమిటంటే ఈమెక్కూడా ఇది రెండో వివాహం. మొదటి భర్తతో విభేదాలు వచ్చి విడిపోయింది. ఆమెకు ఓ బిడ్డ కూడా ఉంది. ఇతడితో రెండో వివాహం జరిగింది. తన భర్త తనకే సొంతం అనుకుంటే ఇప్పుడు చూస్తే మరో అమ్మాయి పేరు పచ్చబొట్టు రూపంలో చేతి మీద ఉంది. అందుకే కోపం కట్టలు తెచ్చుకుంది. పోలీసులు ఇద్ధరికీ కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నారు.