కోమాలోకి వెళ్లిన విద్యార్థిని టీచర్ తన మాటలతో..

ఉపాధ్యాయులు విద్యార్థులకు మంచి విద్యని అందించి జీవితంలో పైకి ఎదగడానికి తోడ్పడతారు. తమిళనాడు తంజావూరుకు చెందిన ఓ ఉపాధ్యాయుడు కోమాలోకి వెళ్లిన ఓ విద్యార్థితో మాట్లాడి ప్రాణం పోశాడు. ప్లస్ టూ చదువుతున్న అరుణ్ పాండియన్ స్కూల్ నుంచి ఇంటికి వస్తూ స్పృహ తప్పి పడిపోయాడు. తోటి విద్యార్థులు అతడిని హుటా హుటిన ఆసుపత్రికి తరలించారు.
అతడిని పరీక్షించిన వైద్యులు నాడి చాలా బలహీనంగా కొట్టుకుంటోందని కోమాలోకి వెళ్లి పోతున్నాడని గ్రహించారు. అప్పటికే విషయం తెలుసుకుని ఆసుపత్రికి వచ్చారు ఉపాధ్యాయులు. అరుణ్ పరిస్థితిని తెలుసుకున్న ఉపాధ్యాయుల్లో ఒకరు అతడి వద్దకు వెళ్లి చెవిలో నీకేం కాలేదు.. నువ్వు కోలుకుంటావు.. నీకోసం మేమంతా వచ్చాము.. అని తమిళ్‌లో చెప్పాడు.
అప్పటి వరకు అచేతన స్థితిలో ఉన్న పాండియన్‌లో కదలికలు రావడం మొదలయ్యాయి. కొద్దిగా కనురెప్పలు కూడా తెరుచుకున్నాయి. మళ్లీ మూతలు పడుతుంటే డాక్టర్లు గమనించి ఇంకా మాట్లాడండి అంటూ టీచర్‌తో చెప్పారు. దాంతో టీచర్ మళ్లీ అరుణ్‌కి వినబడేలా మాట్లాడడం మొదలు పెట్టారు. ఉపాధ్యాయుడి శ్రమఫలించి అరుణ్ వైద్యానికి సహకరించాడు. నిదానంగా కోలుకున్నాడు. తమ బిడ్డ ప్రాణాలు కాపాడిన టీచర్‌ని దేవుడిలా చూశారు అరుణ్ తల్లిదండ్రులు.