మళ్ళీ పాత పాటే పాడిన హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌

home-minister-rajnadh-sing-talks-parliment
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం అమలును పర్యవేక్షించే హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలుగు ప్రజలను నిరుత్సాహ పరిచారు. చరిత్ర, సంస్కృతి చుట్టూ ఆయన ప్రసంగం సాగింది. ఒకానొక సమయంలో టీడీపీ ఎంపీలు అసహనం వ్యక్తంచేస్తూ సభను అడ్డుకున్నారు. ఓసారి వాయిదా పడిన తర్వాత.. మొక్కుబడి మాటలతో ప్రసంగాన్ని ముగించారాయన.
ఆంధ్రప్రదేశ్ విభజన హామీల అమలుపై కమలనాథుల మాటలకు ఆకాశమే హద్దు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు గంటల తరబడి స్పీచ్‌లు దంచేస్తూ.. లెక్కల పద్దులు వినిపిస్తారు. టీడీపీపై, చంద్రబాబుపై నాన్‌స్టాప్ విమర్శలు, ఆరోపణలతో గుక్క తిప్పుకోరు. లోక్‌సభలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మాట్లాడిన తీరు అందుకు పూర్తిగా విరుద్ధం. ఏపీ రాజధానికి 1500 కోట్లు.. రెవెన్యూ లోటు భర్తీకి 15 వేల 900 కోట్లు ఇచ్చామని చెప్పారాయన. పోలవరానికి ఇచ్చింది కేవలం 6 వేల 750 కోట్లు. వెనుకబడిన జిల్లాలకు 1050 కోట్లు, గుంటూరు, విజయవాడ అభివృద్ధికి మరో వెయ్యి కోట్లు ఇచ్చినట్టు తెలిపారు. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ప్రస్తావించిన అంశాలను పరిశీలిస్తామంటూ ముక్తాయించారు రాజ్‌నాథ్‌.
అసలు రాజ్‌నాథ్‌ లేవగానే టీడీపీ ఎంపీలు అలర్టయ్యారు. విభజన చట్టం, హామీల అమలుపై ఏం చెప్తారోనని ఆసక్తిగా చూశారు. ఆయన మాత్రం జాతీయ అంశాలు, చరిత్రకు ప్రాధాన్యం ఇవ్వడంతో ఆగ్రహించారు. ఏపీపై మాట్లాడాలని డిమాండ్ చేస్తూ.. వెల్‌లోకి దూసుకెళ్లారు. గందరగోళం నెలకొనడంతో స్పీకర్ సభను వాయిదా వేయాల్సి వచ్చింది. ఆ తర్వాత మెల్లిగా విభజన చట్టంలోకి వచ్చారాయన. నాలుగేళ్లు పూర్తైన తర్వాత కూడా పరిశీలిస్తున్నామని చెప్పడం ఏంటని టీడీపీ ఎంపీల ప్రశ్న. ఎన్డీయే నుంచి విడిపోయినా చంద్రబాబు మాకు మంచి మిత్రుడేనంటూ రాజకీయ రచ్చ రాజేశారు రాజ్‌నాథ్‌. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షానికి ఇప్పుడిదో ఆయుధం.
లోక్‌సభలో చెప్పిన ప్రతి మాట అధికారికం. రికార్డుల్లోకి వెళ్తాయి. పార్టీ ఆఫీసుల్లో, మీట్‌ ది ప్రెస్‌లలో చెప్పే మాటలకు విలువ అంతంతే. ఆంధ్రప్రదేశ్‌కు అంత చేశాం.. ఇంత చేశామని చెప్పుకునే కమలనాథులు.. రాజ్‌నాథ్‌ ప్రసంగం తర్వాత కూడా తమ వ్యాఖ్యలను సమర్థించుకోగలరా? ఎంతో చేశాం.. ఇంకా చేస్తాం.. అని చెప్పుకోవడం తప్పితే.. ఆంధ్రప్రదేశ్‌పై పట్టుమని పది నిమిషాలు కూడా ప్రసంగం సాగని దుస్థితి.