నమ్మకాన్ని నిలబెట్టుకున్న ఎంపీ గల్లా జయదేవ్!

mp-galla-jayadev-talks-in-loksabha
భరత్ అనే నేను సినిమా నుంచి మొదలైన గల్లా జయ్‌దేవ్‌ ప్రసంగం.. హైపిచ్‌కు వెళ్లింది. సూటి మాటలు.. పదునైన పంచ్‌లతో అనర్గళంగా మాట్లాడారు. చంద్రబాబు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారాయన. ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాను ఉతికి ఆరేశారు. ఆధిపత్యానికి, నైతికతకు జరుగుతున్న పోరాటాన్ని.. బీజేపీ -టీడీపి మధ్య సాగుతున్న యుద్ధంగా అమిత్‌ షా అభివర్ణించారని సభ దృష్టికి తెచ్చారు.
అదే ఫ్లో సాగుతుండగా.. ప్రధానమంత్రిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. మోడీని మోసగాడిగా అభివర్ణించారని రక్షణమంత్రి నిర్మలా సీతారామన్‌ అభ్యంతరం తెలిపారు. దీంతో.. జయ్‌దేవ్‌ ప్రసంగాన్ని పరిశీలించి.. అభ్యంతరకర వ్యాఖ్యలు ఉంటే చర్యలు తీసుకుంటామని స్పీకర్ చెప్పడంతో చల్లబడ్డారు.
 ఇక, అవిశ్వాసం కారణంగా హైలైట్ అయిన నాయకుడు రాహుల్‌గాంధీ. కాంగ్రెస్‌కు అధ్యక్షుడే అయినా.. ఇన్నాళ్లు తన టాలెంట్‌ను బయటపెట్టుకోలేదు. ఈసారి ఎవరూ ఊహించని విధంగా బీజేపీకి ధమ్‌కీ ఇచ్చారాయన. రఫెల్‌ డీల్‌పై రక్షణమంత్రి నిర్మల అబద్ధాలు చెప్తున్నారంటూ దుయ్యబట్టారు.
తాను హిందూస్తానీ అంటూ అరిచి చెప్పిన రాహుల్.. నాటకీయంగా మోడీని హగ్‌ చేసుకుని కొత్త సంప్రదాయానికి తెరతీశారు. చివర్లో కన్నుకొట్టడం వివాదంగా మారింది. రాహుల్‌లో మార్పు కమలానికి మింగుపడలేదు. సభలో అనుచితంగా ప్రవర్తించారని.. అబద్ధాలు చెప్పారంటూ.. బీజేపీ ఎంపీలు ఏకంగా సభాహక్కుల ఉల్లంఘన తీర్మానం ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు.
ప్రధానమంత్రిని రాహుల్‌ కౌగిలించుకోవడం, తర్వాత కన్నుకొట్టడాన్ని స్పీకర్ సుమిత్రా మహాజన్‌ సైతం తప్పుపట్టారు. కాంగ్రెస్ పక్షనేత ఖర్గేను మందలించారామె. రాహుల్‌ తన కొడుకులాంటి వాడు కాబట్టే.. తప్పులను సరిదిద్దాలని చెప్తున్నాట్టు తెలిపారు.మొత్తంమీద  అవిశ్వాస ప్రహసనం ముగిసినా.. సభలో రేగిన మంటలు ఇప్పట్లో చల్లారేలా లేవు. జయ్‌దేవ్‌ వ్యాఖ్యలు.. రాహుల్‌పై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానాలపై కమలనాథులు సీరియస్‌గా వెళ్తారా.. స్పోర్టివ్‌గా తీసుకుంటారా.. అన్నది చూడాలి.