ఇదా పవ’నిజం’..?

pawan-tweets-effect-social-media
పవన్‌ కళ్యాణ్‌ ప్రత్యేక హోదాకు అనుకూలమా? వ్యతిరేకమా? ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో, నెటిజన్లలో ఇప్పుడివే సందేహాలు. జనసేనాని టైమింగ్‌ తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఆయన చేసిన ట్వీట్లే అందుకు కారణం. 
లోక్‌సభలో టీడీపీ వాదన చాలా బలహీనంగా ఉందని పవన్ అభిప్రాయం. ప్రత్యేక హోదా డిమాండ్‌ను అసలు వినిపించలేకపోయారని అన్నారు. అసలు హోదాను డిమాండ్ చేసే నైతికత తెలుగుదేశం పార్టీ కోల్పోయిందని ఆక్షేపించారు. లోక్‌సభలో టీడీపీది వ్యర్థ ప్రసంగంగా కొట్టిపారేశారాయన. కేంద్రం నయవంచన చేస్తోందని తాను రెండేళ్ల క్రితమే చెప్పానని పవన్ గుర్తుచేశారు. ప్రత్యేక ప్యాకేజీని పాచిపోయిన లడ్డూలతో పోల్చానని సంబరపడ్డారు. ప్రజల హృదయాలను గెలుచుకునే మంచి అవకాశం టీడీపీ పోగొట్టుకుందని పవన్ అభిప్రాయం.
పవన్ ట్వీట్లు తీవ్ర విమర్శలకు దారితీశాయి. ఒకప్పుడు అవిశ్వాసం పెడితే 50 మంది ఎంపీలను కూడగడతానని జబ్బలు చరిచిన పవన్‌ ఎక్కడ? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ, కర్నాటక, తమిళనాడు వెళ్లి అక్కడి ఎంపీల మద్దతు కూడగడతానన్న పవన్.. ఆ ప్రయత్నం ఎందుకు చేయలేదని నిలదీశారు. ప్రత్యేక హోదా సాధనకు గతంలో పవన్‌ ఇచ్చిన పిలుపు ఇది. తీరా అవిశ్వాస తీర్మానం పెట్టాక… చర్చ జరిగాక… వ్యర్థ ప్రసంగంతో పోల్చడం.. పవన్ డబుల్‌గేమ్‌ను బట్టబయలు చేస్తోంది. తెలుగువాళ్లంతా కలిసికట్టుగా ఉండి పోరాటం చేయాల్సిన సమయంలో.. పార్లమెంట్‌లో కేంద్రాన్ని నిలదీస్తున్న టీడీపీ ఎంపీలను నైతికంగా దెబ్బకొట్టే ప్రయత్నం ఎందుకు చేశారని కొందరు అనుమానాలు వ్యక్తంచేశారు.
పార్లమెంట్‌లో టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాసం తీర్మానానికి పొరుగు రాష్ట్రాల పార్టీలు మద్దతు పలికాయి. కొందరు ఎంపీలు కేంద్రాన్ని కడిగిపారేశారు. ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలని కేంద్రాన్ని ఇక్కడ కాకుంటే ఎక్కడ నిలదీయాలని రామ్మోహన్‌ నాయుడు చట్టసభలో సూటిగా ప్రశ్నించారు. జయ్‌దేవ్‌, రామ్మోహన్ నాయుడు ప్రసంగాలకు ఏపీ ప్రజలంతా జేజేలు పలుకుతున్నారు. ర్యాలీలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జనసేనాని టీడీపీని టార్గెట్‌ చేస్తూ ట్వీట్లు చేయడం తీవ్ర అభాసుపాలు అవుతోంది. ప్రశ్నించేందుకు పార్టీ పెట్టిన జనసేనానిపైనే.. ఇప్పుడు ప్రశ్నల వర్షం కురుస్తోంది. ఢిల్లీలో మకాం వేసి మోడీ పనిపడదామని వీరావేశంతో ఊగిపోయిన పవన్‌ ఎక్కడున్నరంటూ నెటిజన్లు సంధిస్తున్న సూటి ప్రశ్నలకు పవన్ దగ్గర సమాధానం ఉందా?