మున్నాభాయ్‌లా మారిన రాహుల్ గాంధీ..

rahul-gandhi-speach-in-parliament
రాహుల్‌ గాంధీ మున్నాభాయ్‌లా మారారు. కోపం ద్వేషం తగ్గించుకోవాలంటూ… ఏకంగా ప్రధానమంత్రికే  హగ్‌ ఇచ్చారు. చూడ్డానికి ఎంతో సరదాగా కనిపించిన ఈ సన్నివేశంపై…. బీజేపీ నేతలు మాత్రం మండిపడ్డారు. లోక్‌సభ అన్న సంగతి మరచి… రాహుల్‌ చిన్న పిల్లాడిలా ప్రవర్తించారని విమర్శించారు. అటు స్పీకర్‌ సైతం కాంగ్రెస్‌ అధినేత వ్యవహార శైలిపై పెదవి విరిచారు.
లోక్‌సభలో జరిగిన ఈ అనూహ్య సన్నివేశమే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై  హాట్‌హాట్‌గా మాట్లాడిన రాహుల్‌ గాంధీ ఒక్కసారిగా మున్నాభాయ్‌లా మారిపోయారు. తనను ఎంతగా విమర్శించినా.. తనకు మాత్రం కోపం రాదని.. అలాగే బీజేపీ నాయకులు కూడా ద్వేషం తగ్గించుకోవాలని సూచించారు. అంతేకాదు.. ఓ అడుగు ముందుకేసి.. అందరినీ అశ్చర్య పరుస్తూ… ఏకంగా ప్రధానమంత్రి దగ్గరికెళ్లి… ఆయన్ను ఆలింగనం చేసుకున్నారు. ఈ హఠాత్‌ పరిణామంతో అవాక్కైన మోడీ… అంతలోనే తేరుకుని రాహుల్‌ గాంధీని అభిందించారు..
ఈ సన్నివేశం చూడ్డానికి కాస్త సరదాగానే అనిపించినా.. బీజేపీ నాయకులు మాత్రం దీనిపై తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. రాహుల్‌ వ్యవహార శైలి చిన్న పిల్లాడిలా ఉందంటూ… మంత్రి అనంత్‌కుమార్‌ విమర్శిస్తే… మరో మంత్రి హర్‌ సిమ్రత్‌ కౌర్‌ అయితే… మున్నాభాయ్‌ జప్పీ ఇక్కడ చెల్లదంటూ తేల్చిచెప్పారు.
హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ సైతం రాహుల్‌ వ్యవహార శైలిని తప్పుబట్టారు. లోక్‌సభలో ఇలా వ్యవహరించడం ఏ మాత్రం హూందాగా లేదన్నారు..రాజ్‌నాథ్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాహుల్‌ చేసిన దాంట్లో తప్పేంటని ప్రశ్నించారు. అయితే స్పీకర్‌ మాత్రం రాజ్‌నాథ్ వ్యాఖ్యలను సమర్థించారు. రాహుల్‌ తనకు కొడుకు లాంటి వాడే అయినా… ఆయన చర్య మాత్రం తనకు నచ్చలేదని చెప్పారు. లోక్‌సభకు ఓ హూందాతనం ఉంటుందని.. దాన్ని సభ్యులే కాపాడాలని… ఇలాంటివి ఏవైనా ఉంటే బయట చూసుకోవాలని… అందరికీ క్లాస్‌ తీసుకున్నారు.
బీజేపీ నేతల విమర్శలు ఎలా ఉన్నా… యువనేత చూపిన చొరవ తమకు పాజిటివ్‌ మార్కులే ఇస్తుందని కాంగ్రెస్‌ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అధికార, విపక్షాలన్న బేధ భావాలు మరచి రాహుల్‌ చేసిన ఈ పని… ఆయన రాజకీయ పరిణతికి నిదర్శనమని చెబుతున్నారు.
- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -