ఇస్తానన్నదేమిటి? ఇచ్చిందేమిటని..కేంద్రాన్ని ఉతికారేసిన రామ్మోహన్ నాయుడు

ఊరించి.. ఉసూరనిపించారు ప్రధాని మోడీ. విభజన హమీలకు సంబంధించి బీజేపి ఇచ్చిన హామీలను టీడీపీ ఎంపీలు ఒకొక్కటిగా ప్రస్తావిస్తే.. ప్రధాని మాత్రం తన మార్క్ ప్రసంగం వినిపించారు. ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకుంటామంటూనే.. ఏం చేస్తారో చెప్పకుండా దాటవేశారు. ఇంతకీ టీడీపీ ఎంపీలు ఏం అడిగారు..? వాటికి ప్రధాని మోడీ ఏం సమాధానం ఇచ్చారు?

లోక్‌సభలో ఏపీ సమస్యలను టీడీపీ ఏకరవు పెట్టింది. రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేసిందంటూ ఆ పార్టీ ఎంపీలు సభ సాక్షిగా అంశాల వారీగా వివరించారు. ప్రత్యేక హోదా, రాజధాని సహా వెనుక బడిన జిల్లాలకు నిధులు, మెట్రో ప్రాజెక్ట్, పోలవరం వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వ ఉదాసీన వైఖరిని ఎండ గట్టారు. అలాగే.. కేంద్రం ఎదుట కొన్ని డిమాండ్లు ఉంచారు. టీడీపీ ఎంపీల ఆరోపణలపై స్పందించిన ప్రధాని మోడీ.. ఓ వైపు ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే విషయంలో ఎన్డీయే వెనక్కిపోయే ప్రసక్తి లేదని చెబుతూనే పాత విషయాలనే చెప్పుకొచ్చారు.

ఏపీకి ఇచ్చిన హామీలన్నింటిని కేంద్రం విస్మరించిందన్నారు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్. 2 నుంచి 3 శాతం నెరవేర్చితే మొత్తం నెరవేర్చినట్టా? అని ప్రశ్నించారు. పోలవరం, ఆర్థికలోటు, రాజధానికి 100 శాతం నిధులు ఇస్తామని చెప్పి.. పోలవరం, కేంద్ర విద్యాసంస్థలకు నామమాత్రపు నిధులు ఇచ్చారని తెలిపారు. వెనుకబడిన జిల్లాల కోసం ఆర్బీఐ రూ. 350 కోట్లు జమచేస్తే కేంద్రం ఆ సొమ్మును వెనక్కి తీసుకుందని ఆరోపించారు. కేంద్రం చేయాల్సినంత సాయం చేసి ఉంటే ఏపీ మరోలా ఉండేదన్నారు. విగ్రహాలకు కేటాయించిన నిధులు కూడా ఏపీ రాజధానికి మోడీ కేటాయించలేదని జయదేవ్ మండిపడ్డారు. ఆర్థిక సంఘం అభ్యంతరాలను సాకుగా చూపి ప్రత్యేకహోదా ఇచ్చేది లేదని 2018లో జైట్లీ తేల్చి చెప్పారన్నారు. తిరుపతి వెంకన్న సాక్షిగా మోదీ ప్రత్యేక హోదా హామీ ఇచ్చారని జయదేవ్ గుర్తు చేశారు.

ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఇస్తానన్నదేమిటి? ఇచ్చిందేమిటని నిలదీశారు ఎంపీ రామ్మోహన్ నాయుడు. విశాఖపట్నం ఇండస్ట్రియల్ కాంప్లెక్స్, పెట్రో కెమికల్స్ ప్రాజెక్ట్, కడప స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్‌ పై ప్రశ్నలు సంధించారు. నిబంధనలు మార్చి పోలవరం ముంపు ఏడు మండలాను ఏపీకిచ్చినట్టు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు విషయంలో ప్రధాని నరేంద్రమోడీ మళ్లీ పాత పాటే పాడారు. టీడీపీ ఎంపీలు అడిగిన ప్రశ్నలకు నేరుగా సమాధానం ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే విషయంలో ఎన్డీయే వెనక్కిపోయే ప్రసక్తి లేదన్నారు. తొలిసారిగా చంద్రబాబు పేరును, ఏపీకి ఇస్తామన్న ప్యాకేజీని ప్రస్తావించారు. ఎలాంటి స్పష్టమైన హామీ లేకుండా టాపిక్‌ మార్చేశారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆశలు, ఆకాంక్షలను గౌరవిస్తున్నామని మోడీ తెలిపారు. 14వ ఆర్థికసంఘం సిఫార్సులు తను కట్టడి చేశాయని చెప్పుకొచ్చారు. అందుకే 2016 సెప్టెంబర్‌‌లో ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించగా.. సీఎం చంద్రబాబు కూడా స్వాగతించారని చెప్పారు. రాజధాని, రైతులకు సంబంధించిన విషయాల్లో ఎన్డీయే ప్రభుత్వం వెనకడుగు వేయదన్నారు.

ఏపీకి సంబంధించి ప్రధాని మోడీ ఎలాంటి ప్రకటనా చేయకపోవడాన్ని నిరసిస్తూ టీడీపీ ఎంపీలు ఆందోళనకు దిగారు. ఏపీకి న్యాయం చేయాలంటూ నినదించారు. వారి ఆందోళన మధ్యే ప్రధాని తన ప్రసంగాన్ని కొనసాగించారు.

కేంద్రంపై అవిశ్వాసం తీర్మానం వీగిపోయినా నైతికంగా విజయం సాధించామని టీడీపీ ఎంపీలు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ కు కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని పార్లమెంట్‌ సాక్షిగా దేశమంతటికీ చాటి చెప్పామన్నారు. ఇచ్చిన మాట మేరకు విభజన హామీలను అమలు చేయాల్సిందేనని టీడీపీ ఎంపీలు డిమాండ్ చేశారు.