మోడీపై బాబు డైరెక్ట్‌ అటాక్‌.. దేశ ప్రధాని ఇంత దిగజారుతారా?

ఎప్పుడూ లేనిది సీఎం చంద్రబాబు ప్రధాని మోడీపై డైరెక్ట్‌ అటాక్‌ చేశారు. మోదీ అధికారం ఉందన్న అహంకారంతో మాట్లాడుతున్నారని ఫైరయ్యారు. అవిశ్వాసంపై చర్చ సందర్భంగా తనపై రాజకీయ ఎదురుదాడికి దిగినట్లు ఆరోపించారు. నీతి తప్పారు.. ధర్మాన్ని పాటించలేదంటూ విరుచుకుపడ్డారు. ఇంతకీ ప్రధాని మోడీ మాట్లాడిందేంటి.. వాటికి చంద్రబాబు వేసిన కౌంటర్లేంటి..?

ప్రధాని చాలా చులకనగా..అహంకారంతో మాట్లాడారని సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాను యూటర్న్‌ తీసుకున్నానని రాజకీయ ఎదురుదాడి చేశారని… అవిశ్వాసం పెట్టిన వారికి కాదు, ప్రధానికే అహంకారం ఉందని వ్యాఖ్యానించారు. తనకు, కేసీఆర్‌కు గొడవలు ఉన్నట్లు మాట్లాడారని.. నీతి తప్పారు, ధర్మాన్ని పాటించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంపై పోరాటం కొనసాగిస్తామన్న చంద్రబాబు.. ఎక్కడికక్కడ నిరసనలు చేపట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అటు.. ఇవాళ ఢిల్లీకి వెళ్తున్న చంద్రబాబు.. అవిశ్వాస తీర్మానానికి మద్దతిచ్చిన పార్టీలకు కృతజ్ఞతలు తెలియజేయనున్నారు.

లోక్‌సభలో టీడీపీ అవిశ్వాస తీర్మానం వీగిన తర్వాత మీడియాతో మాట్లాడిని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు…ప్రధాని మోడీపై విరుచుకుపడ్డారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌ భారత్‌లో భాగమే కాదన్నట్లు మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి న్యాయం చేయాలని అడిగినా.. సమస్యలన్నీ సరిచేస్తానని ఎందుకు చెప్పలేకపోయారని ప్రశ్నించారు. ప్రధాని చులకనగా, చౌకబారుగా మాట్లాడటం బాధకలిగించిందని.. అన్యాయం జరిగినప్పుడు ఆదుకోవాల్సిన కర్తవ్యం ప్రధానిది కాదా అని ప్రశ్నించారు. యూటర్న్‌ తీసుకున్నానని ప్రధాని తనపై రాజకీయ ఎదురుదాడి చేశారని… అవిశ్వాసం పెట్టిన వారికి కాదు, ప్రధానికే అహంకారం ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

ఆంధ్రప్రదేశ్ పట్ల ప్రధాని మోదీ మళ్లీ అదే నిర్లక్ష్యం ప్రదర్శించారని చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ఇంతటి బాధ్యతారాహిత్యమైన కేంద్రాన్ని గతంలో తానెప్పుడూ చూడలేదన్నారు. బీజేపీ ప్రభుత్వ దుర్మార్గమైన వైఖరి చూస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వమే నయమనే అభిప్రాయం కలుగుతోందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం చేసిన పోరాటంలో భాగంగా చివరి అస్త్రంగా కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టామని అన్నారు. తెలుగు జాతికున్న దేశ భక్తిని మోదీ శంకించారని, ఇది ఆక్షేపణీయం అన్నారు. ఏపీ అభివృద్ధిపై ఏమాత్రం మాట్లాడలేదన్నారు.

వైసీపీ అధ్యక్షుడు జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఎన్డీయేకు నష్టం జరగకూడదని జగన్, పవన్ కాపాడే ప్రయంత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రధాని ప్రసంగాన్ని టీడీపీ ఎంపీలు అడ్డుకునే ప్రయత్నం చేస్తే.. ఆ పార్టీలు ఎక్కడున్నాయని ప్రశ్నించారు. ప్రజల సొమ్ము కాజేసి ఒకరు కోర్టుకెళ్లారని, మరొకరు ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ ఇద్దరూ ఏపీ ప్రజల గౌరవాన్ని కేంద్రానికి తాకట్టు పెడుతున్నారని విమర్శించారు.

ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేసిన చంద్రబాబు… కేంద్రం తీరును నిరసించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కేంద్రంపై ఒక ప్రాంతీయ పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి అన్ని పార్టీలు కలిసిరావడం ఇదే మొదటిసారి అన్న చంద్రబాబు.. మద్దతిచ్చిన పార్టీలకు కృతజ్ఞతలు చెప్పేందుకు ఢిల్లీ బయల్దేరనున్నారు.

ఎప్పుడూ లేనిది సీఎం చంద్రబాబు ప్రధాని మోడీపై డైరెక్ట్‌ అటాక్‌ చేశారు. మోదీ అధికారం ఉందన్న అహంకారంతో మాట్లాడుతున్నారని ఫైరయ్యారు. అవిశ్వాసంపై చర్చ సందర్భంగా తనపై రాజకీయ ఎదురుదాడికి దిగినట్లు ఆరోపించారు. నీతి తప్పారు.. ధర్మాన్ని పాటించలేదంటూ విరుచుకుపడ్డారు. ఇంతకీ ప్రధాని మోడీ మాట్లాడిందేంటి.. వాటికి చంద్రబాబు వేసిన కౌంటర్లేంటి..?