జగన్‌ నిన్న కోర్టులో ఉంటే మా ఎంపీలు పార్లమెంట్‌లో ఉన్నారు : సీఎం చంద్రబాబునాయుడు

cm-chandrababunaidu-comments-on-yesterday-episode
ఏపీకి జరిగిన అన్యాయాన్ని తెలియజేసేందుకే అవిశ్వాసం పెట్టామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపీకి హోదా ఇస్తామని ఎన్నికల సమయంలో మోడీ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఢిల్లీ తరహా రాజధాని నిర్మిస్తామని చెప్పారన్నారు. విభజన హామీలు నెరవేర్చాలని పలుమార్లు కోరినా కేంద్రం స్పందించలేదన్నారు చంద్రబాబు.
లోక్‌సభలో ప్రధాని మోడీ వ్యాఖ్యలు బాధించాయని చంద్రబాబు  అసంతృప్తిని వ్యక్తం చేశారు. వైసీపీ ట్రాప్‌లో పడ్డారని మోడీ తనతో అన్నారని, తానెప్పుడూ తప్పుచేయనని మోడీతో చెప్పానని సీఎం స్పష్టం చేశారు. ప్రధాని ఆ మాటలు అనడం ఏపీ ప్రజలను అవమానించడమేనన్నారు. నిన్న జగన్‌ కోర్టులో ఉంటే తమ పార్టీ ఎంపీలు పార్లమెంట్‌లో ఉన్నారని వైసీపీని చంద్రబాబు ఎద్దేవా చేశారు.
కేంద్రం సహకారం కోసం మాత్రమే చూడకుండా నాలుగేళ్లుగా రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. పార్లమెంట్‌ తలుపులు మూసి విభజన బిల్లు పాస్‌ చేశారని మోడీ అన్నారని.. మరి ఇప్పుడు జరుగుతున్నదేంటని చంద్రబాబు ప్రశ్నించారు. ఏపీకి న్యాయం చేయాల్సిన బాధ్యత కేంద్రానికి లేదా అని ఆయన నిలదీశారు.
మీడియా సమావేశంలో  చంద్రబాబు ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. తన కంటే కేసీఆర్‌ పరిణతితో వ్యవహరించారని మోడీ అన్నారని, ప్రధాని  అలా మాట్లాడొచ్చా అని బాబు ప్రశ్నించారు. ఇద్దరు ముఖ్యమంత్రులను కూర్చోబెట్టి ఎప్పుడు మాట్లాడారని ఆయన అడిగారు.
యూ టర్న్‌ తనది కాదని, ఇచ్చిన హామీలు అమలు చేయని మీదే యూటర్న్‌ అని కేంద్రాన్ని ఉద్దేశించి చంద్రబాబు విమర్శించారు. ప్రత్యేక హోదాకు సమానంగా ప్యాకేజీ ఇస్తామంటేనే అంగీకరించామని చెప్పారు. అయితే ప్యాకేజీపైనా మాట తప్పడం వల్లే పోరాటానికి దిగామన్నారు.