ఎన్నికలకు సిద్దమైన జయలక్ష్మి డిజైనర్స్

designer-cars-ready-for-poll-campaign
అప్పుడే  రాష్ట్రం లో ఎన్నికల వాతావరణం వచ్చేసింది. ఇప్పటికే రాజకీయ నాయకులు ప్రచారాలకు సిద్దం అవుతున్నారు. అందుకు అవసరం అయిన  ప్రచార రధాలను తయారు చేయిస్తున్నారు.  గుంటూరు కు చెందిన జయలక్ష్మి డిజైనర్స్ ఈ ప్రచార రధాలు తయారు చేస్తూండటం విశేషం.ఇప్పటికే పలు రాష్ట్రాలకు ఎన్నికల ప్రచార రధాలు అందించిన జయలక్ష్మి డిజైనర్స్ ఆంద్ర రాష్ట్రం లో అవసరమైన ప్రచార రధాలు తయారు చేస్తూ ప్రత్యేకతను సంతరించుకున్నారు.
ఎన్నికల వాహనాల తయారీలో అత్యంత అనుభవమున్న సంస్థ గుంటూరు కి చెందిన జయలక్ష్మి డిజైనర్స్ మరోసారి ఎన్నికల వాహనాల తయారీకి శ్రీకారం చుట్టింది.  2004, 2009 మరియు 2014 ఎన్నికలలో రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రముఖ రాజకీయ పార్టీలైన తెలుగు దేశం, కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలకు ప్రచార వాహనాలను ఈ సంస్థ అందజేసింది. గతంలో మహీంద్ర కంపెనీకి చెందిన వాహనాలను ఇందుకు వినియోగించింది.  అయితే ప్రస్తుతం ఇసుజు వాహనాలను వాడుతున్నారు. జపాన్ కు చెందినా ప్రముఖ కార్ల తయారీ కంపెనీ రాష్ట్రంలో నెల్లూరు జిల్లా   శ్రీ సిటి నుండి కార్ల తయారీని 2017 లో ప్రారంభించింది.   మన రాష్ట్రంలో తయారైన వాహనాలు కావడంతో ‘ఇసుజు’ వాహనాలకు టాక్స్ మినహాయింపులున్నాయి. సరుకు రవాణా తరహా వాహనం కావడంతో ఎన్నికల ప్రచారానికి అనువైనదిగా ఈవాహనాన్ని ఎంచుకున్నారు.  వాహనంపై నుండి ప్రచారానికి అనువుగా వాహనం వెనుక భాగం, ఇరువైపులా ఫుట్ బోర్డులు, కార్డ్ లెస్ మైక్, కార్డ్ మైక్, సౌండ్ బాక్స్ లు, వెనుక వేదిక నిర్మాణం, వాషబుల్ కార్పెట్, ఒక కిలో వాట్ జెనరేటర్.  స్టెయిన్లెస్ స్టీల్ పైప్ రైలింగ్, పార్టీ ప్రముఖ నేతలు, అభ్యర్ధి ఫోటో స్టికర్స్ ఉంటాయి. ఇవేగాకుండా వాహనంపై ఉన్న నాయకుడిని ప్రజలు చూసే విధంగా, ప్రజలు నాయకుడికి కనిపించే విధంగా ఎల్ఇడి దీపాలను అమర్చారు.
తెలుగుదేశం పార్టీ, వై.ఎస్.ఆర్ .సి.పి, టిఆర్ఎస్ పార్టీల నుండి ఇప్పటికే ముందస్తు బుకింగ్ లు ప్రారంభమయ్యాయని జయలక్ష్మి డిజైనర్స్ తెలిపారు.ఒరిస్సా రాష్ట్రంలోని బిజూ జనాతాదళ్ పార్టీ అభ్యర్ధులకు వాహనాలు అందించారు. అదేవిధంగా ఇటీవల జరిగిన కర్నాటక ఎన్నికలలో బిజెపి, కాంగ్రెస్ తరుపున  డి.కె. శివ కుమార్ మరియు జెడియు పార్టీ తరుపున మాజీ ప్రధాని శ్రీ హెచ్.డి. దేవగౌడ,బి.జె.పి.తరుపున యడ్యూరప్ప  తదితరులకు ఎన్నికల ప్రచార రధాలు అందించారు.  మొత్తం అరవై ఐదు వాహనాలు కర్నాటకకు  అందించామని వారు తెలిపారు.
ఇక ఈ ఎన్నికల వాహనం డిజైనింగ్ విషయానికి వస్తే,ఇసుజు కంపెనీ కి చెందిన ఇన్నోవా టైపు వెహికల్ ను 10 లక్షలు ఖరీదు చేసి కొనుగోలు చేసి ఆర్డర్ పై 3.50 లక్షలతో ఇంటీరియర్ డెకరేషన్ చేసి ఈ ఎన్నికల ప్రచార రథాన్ని జయలక్ష్మి డిజైనర్స్ తయారు చేసి ఎన్నికల అభ్యర్థి కి అందిస్తున్నారు.. అభ్యర్థి తో పాటు ఈ వాహనం పై సుమారు 30 మంది కార్యకర్తలు ఎక్కి ప్రచారం లో పాల్గొనేందుకు వీలుగా ఉంది. ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాల తో పాటు 2019 ఎన్నికలలో రాజస్థాన్, మహారాష్ట్ర, మరికొన్ని రాష్ట్రాలకు వాహనాలు అందిస్తున్నారు. ఇప్పటికే చేతినిండా ఆర్డర్స్ ఉన్నాయని డిజైనర్ దుర్గా ప్రసాద్ అంటున్నారు. 2019 ఎన్నికలలో వీలైనన్ని ఎక్కువ ఎన్నికల ప్రచార రధాలు తయారు చేయడం లక్ష్యం గా పెట్టుకున్నామని ఆయన తెలిపారు.