అక్కడ కొత్తపార్టీయే గెలుస్తుందా?

nellore-city-contituency-future
ఏపీలో 175 నియోజక వర్గ్గాల్లో ఆయా పరిస్థితులను బట్టి జయాపజయాలు ఆధారపడి ఉంటాయి. అభ్యర్దులు, ఆర్దిక పరిస్థితులు, సామాజిక సమీరణలు ఇలా చాలా పరిస్థితులే ప్రభావితం చేస్తాయి. అయితే నెల్లూరు ఇందుకు భిన్నంగా ఉంటుందా? ఇక్కడ చిత్రవిచిత్ర పరిస్థితులున్నాయి. కొత్తగా పుట్టిన పార్టీకే పట్టం కడతారా? సెంటిమెంట్ నియోజకవర్గంగా ఎలా మారింది? ఇక్కడ హేమాహేమీలైనా సరే.. గెలవాలంటే పార్టీ మారాల్సిందేనా.?
నెల్లూరు నియోజక వర్గం ఎప్పుడూ ప్రత్యేకమైనదే. ఇక్కడి నుంచి గెలుపొందిన వారు.. రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పారు. అయితే ఇక్కడ ఒకసారి గెలిచినవాళ్లు మళ్లీ గెలుస్తారన్న నమ్మకం కూడా లేదు. ఆనం వివేకానంద రెడ్డి మాత్రమే ఈ రికార్డును తిరగరాశారు. అంతకంటే పెద్ద సెంటిమెంట్ ఇక్కడ ఒకటుంది. అదే కొత్త పార్టీలనే గెలిపిస్తారట.
1983 వరకూ రాజకీయంగా జిల్లాలో చక్రం తిప్పిన ఆనం కుటుంబం.. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చింది. తమ కుటుంబ వారసుడిగా ఆనం రాంనారాయాణ రెడ్డిని టీడీపీ తరపున నెల్లూరు నుంచి పోటీచేయించారు. అప్పటికే నెల్లూరులో వామపక్షాల ప్రభావం బలంగా ఉంది. కాంగ్రెస్ పార్టీలో హెమాహెమీలున్నారు. అయినా తట్టుకుని కొత్తగా ఆవిర్భవించిన టీడీపీ అభ్యర్ధి ఆనం రాంనారాయణ రెడ్డి విజయం సాధించారు. అప్పటి నుంచి కాంగ్రెస్, టీడీపీలు ఇక్కడ గెలుస్తూ వచ్చాయి. డీ-లిమిటేషన్ లో భాగంగా నెల్లూరు సిటీ నియోజకవర్గంగా ఏర్పడింది. 2009లో చిరంజీవి నేతృత్వంలో ప్రజారాజ్యంపార్టీ కూడా పుట్టింది. దీంతో త్రిముఖ పోటీ ఆసక్తికరంగా సాగింది. టీడిపి నుండి తాళపాక రమేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుండి పోలుబోయిన అనీల్ కుమార్ యాదవ్, ప్రజారాజ్యం తరపున ముంగమూరు శ్రీదర కృష్ణారెడ్డి బరిలో దిగారు. టిడిపికి డిపాజిట్లు కూడా దక్కలేదు. కాంగ్రెస్ – ప్రజారాజ్యం మధ్య హోరాహోరీగా సాగిన పోరులో ప్రజారాజ్యం అభ్యర్ధి శ్రీధర్ కృష్ణారెడ్డి విజయం సాధించారు. మరోసారి కొత్తగా పుట్టిన పార్టీకి నెల్లూరు వాసులు పట్టం కట్టారు. 2014 ఎన్నికల్లోనూ ఆసక్తికర ఫలితాలే వచ్చాయి. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం అయింది. ఈ ఎన్నికల్లో కొత్తగా పెట్టిన వైసీపీకి నెల్లూరు నియోజకవర్గం ఓటర్లు పట్టం కట్టారు. దీంతో ముచ్చటగా మూడుసార్లు సెంటిమెంట్ రిపీట్ అయింది.
2019లో టీడిపి, ప్రజారాజ్యం, వైసీపిలు సరసన చేరేందుకు జనసేన ఉవ్విళ్లూరుతోంది. 1983, 2009, 2014ల్లో కొత్తగా ఆవిర్బవించిన పార్టీలకు విజయాన్ని అందించిన నెల్లూరు ప్రజలు.. 2019లోనూ తమకు అండగా ఉంటారని జనసేన చెబుతోంది. ఇది నెల్లూరులోని ప్రధాన పార్టీ అభ్యర్ధులకు కలవర పెడుతోంది. కొత్తగా వచ్చే పార్టీ నుండి పోటీ చేసిన వారే సిటీలో గెలుస్తారన్న సెంటిమెంట్ రిపీట్ అవుతుందా అని ఆందోళనలో ఉన్నారు. కొందరు ఈ సెంటిమెంట్ చూసుకుని జనసేన ద్వారా పోటీ చేసేందుకు అంతర్గతంగా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కొందరు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను ప్రసన్నం చేసుకునే పనిలొ నెల్లూరు నగరం నుండి కొందరు ప్రముఖులు పోటీపడుతున్నట్టు తెలుస్తోంది. వీరితోపాటు నెల్లూరు రాజకీయాల్లో తలపండిన నాయకుడిగా పేరుగాంచిన ఆనం వివేకానంద రెడ్డి పెద్ద కొడుకు ఆనం సుబ్బా రెడ్డి ముందు వరుసలో ఉన్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే ఈ సారి నెల్లూరులో పోటీ అధికార ప్రతిపక్షాలతోపాటు కాంగ్రేస్, బిజేపి, జనసేనలతో పోరు కురుక్షేత్రాన్ని తలపించనున్నాయి.