గల్లా జయదేవ్‌ ప్రసంగంలో ఆంధ్రుల ఆవేదన కనిపించింది

టీడీపీ ప్రవేశ పెట్టిన అవిశ్వాస పరీక్షలో కేంద్రం తన బలాన్ని నిరూపించుకుంది. 12గంటల పాటు వాడివేడి చర్చ తరువాత జరిగిన ఓటింగ్ లో అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. అవిశ్వాసంపై చర్చ సందర్భంగా కేంద్ర తీరును విపక్షాలు ఎండగడితే.. అదేస్థాయిలో అధికార పక్షం ఎదురుదాడి చేసింది.

కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. ఆంధ్రప్రదేశ్ విభజన హామీల అమలులో కేంద్ర వైఖరిని నిరసిస్తూ.. తెలుగు దేశం పార్టీ ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో వాడీవేడి చర్చ జరిగింది. శుక్రవారం ఉదయం 11గంటలకు మొదలైన చర్చ.. రాత్రి 11గంటల వరకు 12గంటల పాటు సుదీర్ఘంగా సాగింది. చర్చ తరువాత ఓటింగ్ చేపట్టగా.. 451మంది సభ్యులు పాల్గొన్నారు. అవిశ్వాస తీర్మానికి వ్యతిరేకంగా 325 మంది, అనుకూలంగా 126 మంది ఓటేశారు. దీంతో తీర్మానం వీగిపోయినట్లు స్పీక్పర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు.

అవిశ్వాస తీర్మానంపై చర్చను ప్రారంభించిన గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఆరు కోట్ల ఆంధ్రుల ఆకాంక్షలను పార్లమెంట్ సాక్షిగా బలంగా వినిపించారు. విభజన చట్టం పాస్ అయిన తీరు నుంచి నేటి దాకా ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయాన్ని ఒక్కొక్కటిగా కడిగేపారేశారు. యూసీలంటూ నోటికొచ్చినట్టు మాట్లాడేవారికి లెక్కలతో సహా కేంద్రం గుట్టును చట్టసభలోనే బహిర్గతం చేశారు. నిండుసభలో మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం చేసిన మోసాన్ని ఎండగట్టారు.

గల్ల జయదేవ్‌ ప్రసంగంలో ఆంధ్రుల ఆవేదన తనకు కనిపించిందన్నారు రాహుల్. అవిశ్వాస తీర్మాన చర్చలో రాహుల్‌ కేంద్రంపై నిప్పులు చెరిగారు. రాఫెల్‌ డీల్‌లో ప్రధాని మోడీ, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. గతంలో తాను ప్రధానిని కాదు… దేశానికి కాపలాదారుడ్ని అని చెప్పిన ప్రధాని.. ఇప్పుడు అమిత్‌ షా కుమారుడు దేశాన్ని దోచుకుంటుంటే నోరు ఎందుకు మెదపరని ప్రశ్నించారు.

ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం అమలును పర్యవేక్షించే హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలుగు ప్రజలను నిరుత్సాహ పరిచారు. టీడీపీ డిమాండ్లపై నేరుగా స్పందించకుండా.. చరిత్ర, సంస్కృతి చుట్టూ ఆయన ప్రసంగం సాగింది. ఒకానొక సమయంలో టీడీపీ ఎంపీలు అసహనం వ్యక్తంచేస్తూ సభను అడ్డుకున్నారు. ఓసారి వాయిదా పడిన తర్వాత.. మొక్కుబడి మాటలతో ప్రసంగాన్ని ముగించారాయన.

టిడిపిపై తీవ్ర విమర్శలు చేశారు విశాఖ ఎంపీ హరిబాబు. మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్‌పై పోరాడుతున్న టీడీపీ ఇవాళ అదే పార్టీతో చేతులు కలపడం విడ్డూరమన్నారు. లోక్‌సభలో టీడీపీ వ్యవహరిస్తున్న తీరు చూస్తే ఎన్టీఆర్‌ ఆత్మ క్షోభిస్తుందన్నారు. ప్రత్యేక హోదా అంశం విభజన చట్టంలో చేర్చని పాపం కాంగ్రెస్‌దే అన్నారు. ఇప్పటి వరకు ఏపీకి కేంద్రం ఏమిచ్చింది? ఇంకా ఏమివ్వాలన్నదానిపై పూర్తి వివరణ ఇచ్చారు.

తరువాత టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు పదినిమిషాల పాటు.. కేంద్రం తీరుపై నిప్పులు చెరిగారు.. కేంద్రం ఇచ్చిన హామీలు, మోసం చేసిన తీరును ఏకరువు పెట్టారు.. మాట్లాడింది కాసేపైనా సూటిగా సుత్తిలేకుండా ప్రసగించారు.. నాలుగేళ్ల నుంచి చేయని సాయం.. 24 గంటల్లో చేస్తామంటూ హరిబాబు ఎవరిని మోసం చేస్తున్నారని ఓ రేంజ్‌లో ఫైరయ్యారు.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు విషయంలో ప్రధాని నరేంద్రమోదీ మళ్లీ పాత పాటే పాడారు. గతంలో జైట్లీ, రాజ్‌నాథ్‌సింగ్‌ చెప్పిన మాటలనే చెప్పారే తప్ప కొత్తగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఓ వైపు ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే విషయంలో ఎన్డీయే వెనక్కిపోయే ప్రసక్తి లేదని చెబుతూనే పాత విషయాలనే చెప్పుకొచ్చారు. పైగా ప్రత్యేక ప్యాకేజీ విషయంలో టీడీపీనే యూటర్న్‌ తీసుకుందంటూ విమర్శించారు. టీడీపీ ఎంపీల నిరసన మధ్యే మోడీ ప్రసంగం సాగింది.

అవిశ్వాస తీర్మానంపై చర్చకు టీడీపీ ఎంపీ కేశినేని నాని ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. మోదీ ప్రసంగం బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీని తలపించిందన్నారు. ప్రపంచంలోనే ఉత్తమ నటుడని విమర్శించారు. 2014కి ముందు కూడా అబద్ధపు హామీలిచ్చారని.. ఇప్పుడు కూడా అదే జరుగుతోందన్నారు. మోడీ మాటల్లో ఏపీకి న్యాయం చేస్తామన్న మాట ఎక్కడా లేదన్నారు కేశినేని.

మొత్తానికి అవిశ్వాస తీర్మానంపై సుదీర్ఘంగా జరిగిన చర్చలో అధికార, విపక్షాలు వారి వారి వాదనను సమర్ధవంతంగా వినిపించాయి. అవిశ్వాస తీర్మానం వీగిపోయినట్లు ప్రకటించిన తరువాత.. సభను స్పీకర్ సోమవారానికి వాయిదా వేశారు.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -