రాహుల్ గాంధీలో మార్పు…రాహుల్‌ చర్యతో ప్రధాని మోడీ అవాక్కు..!

అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా లోక్‌సభలో మాటల యుద్ధం నడిచింది. ప్రధాని మోడీ టార్గెట్ చేస్తూ రాహుల్ అంశాల వారీగా విమర్శలు గుప్పించారు. అటు రాహుల్ ఆరోపణలకు ప్రధాని మోడీ అదేస్థాయిలో కౌంటర్లు ఇచ్చారు. ఇక ప్రధాని మోడీపై ఘాటైన విమర్శలతో సభలో వాతావరణాన్ని వేడెక్కించిన రాహుల్.. ప్రసంగం తరువాత అందరినీ విస్మయానికి గురి చేశారు. రాహుల్ చర్యను స్పీకర్ తప్పుపట్టాగా కాంగ్రెస్ మాత్రం సమర్ధించింది.

అవిశ్వాస తీర్మాన చర్చలో రాహుల్‌ గాంధీ నిప్పులు చెరిగారు. ముఖ్యంగా ప్రధాని మోడీ, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. గతంలో తాను ప్రధానిని కాదు… దేశానికి కాపలాదారుడ్ని అని చెప్పిన ప్రధాని.. ఇప్పుడు అమిత్‌ షా కుమారుడు దేశాన్ని దోచుకుంటుంటే ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. అమిత్‌ షా కొడుకు తన ఆదాయన్ని 16000 రెట్లు పెంచుకున్నపుడు నోరు ఎందుకు మెదపలేదని నిలదీశారు. రాహుల్ ప్రశ్నకు మోడీ అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు.

రాఫెల్‌ డీల్‌లో భారీ స్కాం జరిగిందని రాహుల్‌ ఆరోపించారు. రాఫెల్‌ కొనుగోళ్లలో వంద శాతం అక్రమాలు జరగలేదని నిరూపించగలరా? అని మోడీకి సవాల్ చేశారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ అబద్దాలు చెప్పి దేశాన్ని మోసం చేశారని రాహుల్ విమర్శించారు. కేంద్రంలో బీజేపి ప్రభుత్వం వచ్చిన తరువాత అవినీతి జాడలేకుండా పోయిందన్న మోడీ.. ఆరోపణలు కాదు, ఆధారాలు చూపించాలన్నారు.

అవినీతిలో కూరుకుపోయిన ప్రధాని మోడీ.. తన కళ్లలోకి సూటిగా చూడలేక పోతున్నారని రాహుల్ ఎద్దేవా చేశారు. తప్పు చేసిన వారు మాత్రమే అలా ప్రవర్తిస్తారని, ప్రధాని పైకి నవ్వుతున్నా.. ఆయన కళ్లలో ఆందోళన కనిపిస్తున్నదని అన్నారు. కళ్లల్లో కళ్లు పెట్టి చూడలేరంటూ తనపై రాహుల్ చేసిన వ్యాఖ్యలపై మోడీ సెటైర్లు వేశారు. ఆ వ్యాఖ్యలు రాహుల్ అహంకారాని నిదర్శనమన్నారు.

ప్రధాని మోడీపై నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ.. తన ప్రసంగం ముగించిన తరువాత.. అందరికీ షాక్ ఇచ్చారు. నేరుగా ప్రధాని మోడీ దగ్గరకు వెళ్లి ఆలింగనం చేసుకున్నారు. రాహుల్‌ చర్యతో ప్రధాని మోడీ అవాక్కయ్యారు. తరువాత తన సీటులో కూర్చున్న రాహుల్.. సహచర ఎంపీలకు కన్నుగొట్టారు. కాంగ్రెస్ అధినేత తీరును స్పీకర్ సుమిత్రా మాహాజన్ తప్పుపట్టారు. సభలో ప్రధానిని ఆలింగనం చేసుకోవడం, కన్నుగొట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. బయట ఒకరినొకరు ఆలింగనం చేసుకోవడంపై తనకు అభ్యంతరం లేదని.. కానీ సభలో అలా ప్రవర్తించడం సరికాదన్నారు. అటు కాంగ్రెస్ పార్టీ మాత్రం రాహుల్ చర్యను సమర్ధించింది. శత్రువును కూడా ఎలా ప్రేమించాలో ప్రపంచానికి చాటిన చర్యగా కాంగ్రెస్ అభివర్ణించింది.