బాధించే గొంతు నొప్పికి గోరు వెచ్చని ఉప్పునీటితో పాటు..

వర్షాకాలంలో ఇబ్బంది పెట్టే గొంతు నొప్పి ఒక్కోసారి మామూలు రోజుల్లో కూడా సతాయిస్తుంది. దీనికి కారణం వైరల్ లేదా బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్. కొన్ని సార్లు కారణం ఏమీ లేకపోయినా గొంతు నొప్పి బాధిస్తుంది. చిన్నవాళ్లనుంచి పెద్ద వారి వరకు ఈ నొప్పితో ఇబ్బంది పడుతుంటారు. చిన్నపిల్లలు అయితే టాన్సిల్స్ కారణంగా తరచూ గొంతు నొప్పితో బాధపడుతుంటారు. మాట బొంగురు పోవడం, మాట్లాడుతుంటే నొప్పిగా ఉండడం, మింగలేకపోవడం వంటివి ప్రధాన లక్షణాలు. కొందరికి గొంతు నొప్పితో పాటు జ్వరం, దగ్గు వంటివి వచ్చి ఇబ్బంది పడుతుంటారు. 
గోరువెచ్చని నీటిలో రాళ్ల ఉప్పు వేసుకుని మూడుపూటలా పుక్కిలిస్తే ఉపశమనం ఉంటుంది. గొంతులోకి వెళ్లిన ఉప్పు నీరు కఫాన్ని తగ్గిస్తుంది. ఇన్‌ఫెక్షన్లను దరి చేరకుండా చూస్తుంది.
ఇలా బాధిస్తున్నప్పుడు స్పూన్ అల్లం తురుమును కప్పు నీటిలో మరిగించి వడకట్టాలి. దీనికి స్పూన్ తేనె కలిపి వేడిగా తీసుకుంటే తక్షణ ఉపశమనం ఉంటుంది. ఇలా మూడు పూట్లా తీసుకుంటే నొప్పి పూర్తిగా తగ్గుముఖం పడుతుంది.
రెండు లవంగాలు, లేదా రాళ్ల ఉప్పును బుగ్గన పెట్టుకుని చప్పరిస్తూ ఉంటే కూడా రిలీఫ్ వస్తుంది.
చిన్న పటిక బెల్లం ముక్క నోట్లో పెట్టుకుని చప్పరించినా నొప్పి మెల్లగా తగ్గుతుంది.
ఒక గ్లాసు నీటిలో నిమ్మరసం కలిపి రోజూ తీసుకుంటే గొంతునొప్పి సమస్య తగ్గుతుంది.
దాల్చిన చెక్క పొడి, తేనె కలిపిన మిశ్రమాన్ని తీసుకుంటే కూడా దగ్గు, జలుబు వంటి వాటినుంచి ఉపశమనం లభిస్తుంది.