బంగాళాఖాతంలో వాయుగుండం…రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు

వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటింది. దీని ప్రభావంతో ఉత్తరకోస్తాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఒడిశాలో కురుస్తున్న వర్షాలతో వంశధార నది పొంగి పొర్లుతోంది. నీటి మట్టం అంతకంతకు పెరిగిపోతుండటంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. హీర మండలంలోని గొట్టా బ్యారేజీ 22 గేట్లు ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు వదులుతున్నారు. ఒడిశా క్యాచ్‌మెంట్ ఏరియా నుంచి మరింత వరద వచ్చే అవకాశం ఉండడంతో గొట్టా బ్యారేజీని అధికారులు పూర్తిగా ఖాళీ చేస్తున్నారు. వంశధార ఉధృతితో కొత్తూరు, ఎల్ఎన్‌పేట మండలాల్లోని తీరప్రాంతాలకు ముంపు ముప్పు పొంచి ఉండటంతో స్థానికులను అధికారులు అప్రమత్తం చేశారు.

నాగావళి, వంశధార వరద ఉధృతితో శ్రీకాకుళం జిల్లాలోని నదీపరీవాహక ప్రాంతాల్లో ప్రాజెక్ట్‌లకు భారీగా నీరు చేరుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమలమయ్యాయి.

పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలంలో గోదారి పరవళ్లు తొక్కుతోంది. కొత్తూరు కాజ్ వే పై వరద పారుతుండడంతో అక్కడి 24 గిరిజన గ్రామాలకు రవాణా నిలిచిపోయింది.467. సోకులేరు, చీకటి వాగు, అత్తాకోడళ్ల వాగులు పొంగడంతో చింతూరు, వీఆర్ పురం మండలాల్లోని చాలా గ్రామాలు ముంపునకు గురయ్యాయి. చింతూరు వద్ద శబరి నది నీటిమట్టం 36 అడుగులకు చేరడంతో ఏజెన్సీ వాసులు ఆందోళనకు గురవుతున్నారు.6979

ఎగువ నుంచి వస్తున్న వరదలతో గోదావరి నీటిమట్టం అంతకంతకు పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ మొత్తం గేట్లను ఎత్తి నాలుగు లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని సముద్రంలో వదులుతున్నారు.

ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లాను వర్షం ముంచెత్తింది. మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో జిల్లాలోని కుంటలు, చెరువులు పొంగిప్రవహిస్తున్నాయి. బొగ్గులవాగు ఉప్పొంగడంతో లక్నవరం సరస్సులోకి భారీగా నీరు చేరుతోంది. ఏజెన్సీలోని పలు గ్రామాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. హైలెవల్ వంతెన నిర్మించాలని దశాబ్దాలుగా పోరాడుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో ప్రతిసారి ఇబ్బందులు పడుతున్నామని ముంపువాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో కృష్ణమ్మ బిరబిరా పరుగులెడుతోంది. ఆల్మట్టి , నారాయణపూర్ నుంచి జూరాల మీదుగా శ్రీశైలం ప్రాజెక్టులోకి చేరుతోంది. డ్యాంలోకి 12 గంటల్లో 10 టీఎంసీలకుపైగా వరద చేరింది. శ్రీశైలంలోకి ఇన్‌ఫ్లో రెండు లక్షల క్యూసెక్కులకు పైగానే ఉండటంతో జలాశయ నీటిమట్టం గంటగంటకు పెరుగుతోంది. ఈ ప్రవాహం ఇలాగే కొనసాగితే మరో 10 రోజుల్లో డ్యాం పూర్తి స్థాయిలో నిండతుందని ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు.