ఆయన అలా మాట్లాడటం దుర్మార్గం – చంద్రబాబు

ప్రధాని మోడీపై నిప్పులు చెరిగారు. స్థాయిని మరచి తనపై విమర్శలు చేశారని మండిపడ్డారు. కేంద్రం చొరవచూపి ఉంటే.. తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యలన్నీ ఎప్పుడో పరిష్కారమై ఉండేవన్న చంద్రబాబు.. ఆంధ్రప్రదేశ్ పునర్విభన చట్టంలో చెప్పిన ప్రతీ అంశం సహా ప్రత్యేక హోదా ఇచ్చే వరకు పోరు కొనసాగుతుందని కేంద్రాన్ని హెచ్చరించారు.

ఏపీకి జరిగిన అన్యాయంపై కేంద్రాన్ని నిలదీసేందుకు అవిశ్వాసం పెట్టామన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఢిల్లీలో పర్యటనలో అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపిన పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు. అవిశ్వాసంపై చర్చ సందర్భంగా.. నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలు బాధించాయన్నారు చంద్రబాబు.

ప్రత్యేక హోదాపై చంద్రబాబే యూ టర్న్ తీసుకున్నారన్న మోడీ వ్యాఖ్యలను తప్పుపట్టారు. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి.. ఆర్ధిక సంఘాన్ని సాకుగా చూపి తప్పించుకున్నది మోడీ కాదా అని ప్రశ్నించారు. ప్రత్యేక ప్యాకేజిని తెరపైకి తెచ్చి.. అన్యాయం చేసింది కేంద్రమేనంటూ నిప్పులు చెరిగారు.

వైసీపీ ట్రాప్‌లో తాను పడ్డానంటూ ప్రధాని మాట్లాడటం దుర్మార్గమన్నారు చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం పోరాడుతున్న తెలుగు దేశం పార్టీకి.. వైసీపీకి పోలికే లేదన్నారు. కేసీఆర్‌ పరిణితితో వ్యవహరించారంటూ తనని మోడీ విమర్శించారని చెప్పారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి మాటలు ఎలా మాట్లాడతారని మోడీని ప్రశ్నించారు.

విశాఖ రైల్వే జోన్ సహా.. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న కడప ఉక్కు కర్మాగార నిర్మాణానికి కేంద్రం ముందుకు రాకపోవడాన్ని చంద్రబాబు తప్పు పట్టారు. అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామన్నా కొర్రీలు పెడుతున్నారని మండిపడ్డారు.

కేంద్రం నమ్మకద్రోహం – కుట్ర రాజకీయాలపై ధర్మపోరాటం చేస్తున్నామని, రాష్ట్రానికి ఇచ్చిన హామీలు నెరవేర్చేదాకా తమ పోరాటం కొనసాగుతుందని చంద్రబాబు స్పష్టంచేశారు.