ఇల్లు ఏది కొనాలి.. కొత్తదా.. పాతదా..

కొత్త ఇల్లు కొనాలంటే బడ్జెట్ భయపెడుతుంది.. పాత ఇల్లు కొందామంటే దానిలోని లోటు పాట్లు, ఎందుకు అమ్ముతున్నారో సరిగా తెలియక పోవడం ఇలా ఎన్నో ఆలోచనలు మదిలో మెదులుతుంటాయి. మొత్తానికి ఏక్కడో ఓ చోట ఏదో ఒక ఇల్లు ఈ ఏడాది అయినా కొనాలన్న ఇల్లాలి పోరు. వెరసి ఇల్లు వెదకడానికి శ్రీకారం చుట్టాడు సుబ్బారావు. భాగ్య నగరం హైదరాబాదులో సొంత ఇల్లు ఉండడమే భాగ్యంరా బాబూ. అది కొత్తదా పాతదా అన్నదాంతో సంబంధం లేదు.
ఏదో ఒకటి కొనరా అద్దె కట్టే బాధ తప్పుతుంది అని స్నేహితుల సలహా. పట్టణాల్లో పాత ఇళ్లకి కూడా మంచి డిమాండే ఉంటుంది. ఎక్కడో ఊరి చివర తక్కువ ధరకు కొత్త ఇల్లు వస్తుందని కొనే బదులు సిటీకి మధ్యలో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్న ఏరియాని ఎంచుకుని పాత ఇల్లైనా కొనుగోలు చేస్తే మంచిది అనేవారూ లేకపోలేదు.
ఊరికి దూరంగా పాత ఇల్లు కొంటే భవిష్యత్తులో చేతిలో కాస్త డబ్బులు ఉన్నప్పుడు ఇప్పటి అవసరాలకు తగ్గట్టుగా పాత ఇంటిని పడగొట్టి కొత్తది కట్టుకోవచ్చు. అయితే, విద్యా, వైద్యం, ఉద్యోగ రీత్యా నగరం మధ్యలో నివసించాల్సి వస్తే కొత్త ఇల్లు కొనలేని పరిస్థితి. అందుకే పాత ఇల్లైనా పర్లేదు అనుకుంటే ముందుకు వెళ్లడం మంచిది.బడ్జెట్ కొంత వరకు ఏర్పాటు చేసుకోగలమనుకుంటే కొత్తదే కొనుగోలు చేయవచ్చు.
ఎందుకంటే అవి ఇప్పటి ప్రమాణాలకు తగ్గట్టుగా ఉంటాయి. గాలీ, వెలుతురు ధారళంగా వీచేలా కిటీకీలు, తలుపులు నిర్మిస్తారు. ఇలాంటి ఇళ్లలో నివసించేవారు ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది.
ఒకవేళ రీసేల్ కొనాలనుకున్నట్లయితే ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ పక్కాగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఉన్నంతలో సౌకర్యాలు నివాస యోగ్యంగా ఉన్నాయో లేదో చూసుకొని కొనుక్కుంటే బెటర్. పాత ఇల్లయినా అన్ని రిపేర్లు చేయించుకుని కలర్స్ వేయించుకుంటే కొత్త ఇల్లులానే ఉంటుంది.