వైసీపీ మద్దతు ఆ పార్టీకే! – జగన్

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీకే వైసీపీ మద్దతిస్తుందని ఆ పార్టీ అధినేత జగన్ పునరుద్ఘాటించారు. ఈనెల 24న ఏపీ బంద్‌కు పిలుపునిచ్చారు.

రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయానికి నిరసనగా బంద్‌ చేపడుతున్నామన్నారు. టీడీపీ ఎంపీలు రాజీనామా చేసి.. 25మంది దీక్షలు చేపడితే.. హోదా ఎందుకు రాదని జగన్ ప్రశ్నించారు.

లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగిన తీరు బాధ కలిగించిందన్నారు వైసీపీ అధినేత జగన్. ఆంధ్ర ప్రదేశ్ రాష్టం సమస్యలపై జాతీయ పెద్దల నోటి నుంచి ఒక్క మాట రాలేదన్నారు.

పార్లమెంట్‌ సాక్ష్యంగా ఆదుకుంటామని చెప్పి అప్పటి అధికార పక్షం, ప్రతిపక్షం, అన్ని పార్టీలు రాష్ట్రాన్ని విడగొట్టాయన్నారు. ఆ తర్వాత హామీలు నెరవేర్చకపోగా.. నరేంద్ర మోడీ దాటవేత ధోరణి అవలంభించారని మండిపడ్డారు.

తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్, నాలుగేళ్లుగా వైసీపీ చెబుతున్నదానినే వల్లె వేశారని జగన్ అన్నారు. అప్పుడు తాము ఈ మాటలు చెబితే.. ఎగతాళి చేశారన్న ఆయన.. ప్రత్యేక హోదా అవసరం లేదని, కోడలు మగపిల్లాడు కంటానంటే అత్త వద్దంటుందా? అదేమన్నా సంజీవనా అంటూ చంద్రబాబు దారుణంగా మాట్లాడారని వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు.

వైసీపీ ఎంపీలతో పాటు.. టీడీపీ ఎంపీలు రాజీనామా చేసి ఉంటే దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్‌ గురించే చర్చ జరిగి ఉండేదన్నారు జగన్. ఇది తెలిసి కూడా చంద్రబాబు తన ఎంపీలతో రాజీనామా చేయించకపోవడం అధర్మమన్నారు.

ఇప్పటికైనా టీడీపీ ఎంపీలు రాజీనామా చేసి.. 25 మంది ఎంపీలు నిరాహార దీక్షకు కూర్చుంటే.. కేంద్రం ఎందుకు దిగిరాదో చూద్దామన్నారు. కేంద్ర నిర్లక్ష్య వైఖరికి నిరసనగా.. ఈనెల 24న ఏపీ బంద్‌కు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఫైల్‌పై ఎవరు సంతకం పెడతారో వారికే వైసీపీ మద్దతు ఉంటుందని చెప్పారు.

జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 217వ రోజు తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్‌లో కొనసాగింది. అచ్చంపేట జంక్షన్‌లో మత్స్యకారులతో వైఎస్‌ జగన్‌ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. మత్స్యకారులపై వరాల వర్షం కురిపించిన జగన్.. వైసీపీ ప్రభుత్వం రాగానే.. వేటకు వెళ్లిన మత్స్యకారులు ప్రమాదవశాత్తూ చనిపోతే వారి కుటుంబానికి 10 లక్షల రూపాయల పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు.