కేవలం నాలుగు గంటలే.. కారణం..

స్కూల్ అంటే రెండు పూటలా క్లాసులు జరుగుతాయి. అలాంటిది మాదాపూర్ లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో మాత్రం కేవలం ఒంటిపూట బడులు మాత్రమే నడుస్తున్నాయి. హైదరాబాద్ లోని మాదాపూర్ లో హైటెక్‌ సిటీ పక్కనే ఉంది ప్రభుత్వ పాఠశాల.

ఇందులో దాదాపు 1200 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఉదయం ప్రైమరీ సెక్షన్‌ జరిగితే.. మధ్యాహ్నం నుంచి హైస్కూల్‌ నడుస్తుంది. దీనికి కారణం స్కూల్ కు అవసరమైన భవన సముదాయాలు లేకపోవడమే.

కేవలం ఒకే ఒక్క భవనం ఉండటం చేత పూటకు ఒక సెక్షన్ మాత్రమే జరుగుతుంది. ఉదయం 11.50కి ప్రైమరీ సెక్షన్‌ పూర్తి చేసి..మధ్యాహ్నం 12 గంటల నుంచి హైస్కూల్‌ పిల్లలకు తరగతులు నిర్వహిస్తున్నారు టీచర్లు.

అయితే క్లాసులు జరిగే ఈ నాలుగు గంటల్లో విద్యార్థులకు ఏమి చెప్పాలో అర్ధంకాక ఎలాగోలా కానిచ్చేస్తున్నారు. దీనివల్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన పెరిగిపోతోంది.

ఇదిలావుంటే అదనపు తరగతి గదుల కోసం ప్రస్తుత స్కూల్ వెనక నూతన భవననిర్మాణం జరుగుతోంది. అయితే ఇది ప్రారంభించి చాలా రోజులు అవుతున్నా.. ఇంకా పూర్తికాకపోవడంతో విద్యార్థులు అసౌకర్యానికి గురవుతున్నారు.

ప్రస్తుతం ఉన్న భవనంలో కనీస అవసరాలు కూడా లేవు, పైగా వందలమంది విద్యార్థులకు ఒకే టాయిలెట్ ఉండటం చేత ఇబ్బందిపడాల్సి వస్తోంది.

మరోవైపు నూతన స్కూల్ నిర్మాణం త్వరలోనే పూర్తవుతుందని అధికారులు చెబుతున్నా.. వారు ఇలాగే చెబుతూ.. నిర్లక్ష్యం చేస్తున్నారని విద్యార్థులు అంటున్నారు.

అభివృద్ధికి కేంద్రంగా చెప్పుకునే హైటెక్‌సిటీలోని మాదాపూర్‌ ప్రభుత్వ పాఠశాల దుస్థితి ఇలా ఉంటే మారుమూల ప్రాంతాల్లో స్కూళ్ల పరిస్థితి ఏంటన్న ప్రశ్న తలెత్తుతోంది.

– నరేంద్ర