సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ విషయంలో నేను అదే చేస్తా!

నటిగా మొదటి సినిమాతోనే నంది అవార్డ్ ను సొంతం చేసుకున్న మంచులక్ష్మి కి కెరియర్ అంత సులువుగా గాడిలో పడలేదు. తనను తాను నిలబెట్టుకోవడానికి పడ్డ కష్టం తక్కువేం కాదు. గుండెల్లో గోదారి తో నిర్మాతగా మారి తన అభిరుచి ని ప్రేక్షకులకు పరిచయం చేసింది. 
 
హోస్ట్ గా కాసేపు సరదా మాటలతో సరిపెట్టుకోకుండా సామాజిక బాధ్యతను గుర్తుచేసింది. ‘మేము సైతం’ టెలివిజన్ రియాలిటీ షో భిన్నంగా కనిపించిందంటే కారణం మంచులక్ష్మియే. కొన్ని కుటుంబాలకు ఆసరాగా నిలబడింది. తను చేసే ప్రతి సినిమాలో కూడా మహిళ పాత్రను ఉదాత్తంగా నిలుపుతుంది. కొంత గ్యాప్ తర్వాత వైఫ్ ఆఫ్ రామ్ గా మారింది. 
Q. వైఫ్ ఆఫ్ రామ్ కథ వినగానే..?
విజయ్ ని ఒక యాడ్ ఫిల్మ్ షూటింగ్ టైం లో కలిసాను. అతను వర్కింగ్ స్టైయిల్ నాకు నచ్చింది. సెట్ లో తన పని తప్ప మరొకటి పట్టదు. చిన్న యాడ్ ఫిల్మ్ కోసం నాచేత 5 గంటలు డబ్బింగ్ చెప్పించాడు.
ఏంట్రా బాబు ఇంత ఓవర్ చేస్తున్నాడు అనుకున్నా.. కానీ ఆ యాడ్ రిలీజ్ అయ్యాక చూస్తే విజయ్ చేసిన ఛేంజస్ ఎంత ఎఫెక్ట్ ని తెచ్చాయో తెలిసింది. దీంతో ఒక రోజు నేనే కాల్ చేసి కథల గురించి అడిగాను.
అతను ఒక వారం టైం తీసుకొని ఈ కథ చెప్పాడు. నేను ఎదురు చూస్తున్న పాత్ర కనిపించగానే వెంటనే ఓకే చెప్పాను.
Q. పాటలు, ఫైట్స్ లేకుండా సినిమా అనగానే మీకు కమర్షియల్ గా వర్క్ అవుట్ అవదనే భయం కలుగలేదా..?
లేదు. ఇందులో పాటలు, ఫైట్స్ పెడితేనే భయపడాలి. ప్రేక్షకుడిని ఒక మూడ్ లోకి తీసుకెళ్ళి మళ్ళీ అతని మూడ్ ని చెడగొట్టి పాటలు పెట్టడం కరెక్ట్ కాదనిపించింది. అందుకే ఈ సినిమా మొదలవడమే మీరు కథకు కనెక్ట్ అవుతారు. తర్వాత మీకు టైం తెలియదు. దీక్షతో పాటు మీరూ ప్రయాణం మొదలు పెడతారు.
Q. దీక్ష భయపడుతుందా? భయపెడుతుందా?
(నవ్వుతూ..) అది మీరు థియేటర్ లోనే చూడాలి.. దీక్ష భయపడుతుంది. కానీ ఆ భయం ఎందుకు? అనేది సస్పెన్స్. అయితే దీక్ష పాత్ర మీకు కొత్తగా అనిపిస్తుంది. ఆ పాత్రలోని నిజాయితీ మిమ్మల్ని, మీ మనసులను తప్పకుండా గెలుస్తుంది. అంత వరకూ చెప్పగలను.
Q. విజయ్ యెలకంటి తో వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ ..?
చాలా ప్రతిభావంతుడు. తన పనిమీద చాలా క్లారిటీ ఉన్న దర్శకుడు. ఈ సినిమా అనుకున్న టైం లో పూర్తి చేయగలిగాం అంటే అతని ప్లానింగ్ కారణం. ప్రతి సీన్ ని వర్క్ షాప్ లో చేసాం. అతను ఒక్క అనవసరపు షాట్ కూడా తీయడు. అలాంటి దర్శకుడ్ని పరిచయం చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది.
Q. ప్రియదర్శిని కమెడియన్ గా పాపులర్ అయ్యాడు? ఇందులో ఒక సీరియస్ రోల్ లో తీసుకోవడానికి కారణం?
అలాంటి ముద్రలే ఆర్టిస్ట్ ని కట్టిపడేస్తాయి. వారికి అలాంటి పాత్రలే చేస్తూ పోతే ఏదో ఒకరోజు తప్పకుండా మీరే.. అతను ఒకేరకం పాత్రలు చేస్తున్నాడు అంటారు. ప్రియదర్శి మంచి నటుడు అతను ఈ పాత్రకు న్యాయం చేస్తాడని నమ్మాం. మా నమ్మకాన్ని వంద శాంత నిలబెట్టాడు.
ఇంకా చెప్పాలంటే ప్రియదర్శి మీద కమెడియన్ అనే ముద్రను తీసివేస్తుంది ఈ పాత్ర. తను అనుకున్న దాన్ని సిన్సియర్ గా చేసే ఒక పోలీస్ పాత్రలో కనిపిస్తాడు.
Q. తమిళ పరిశ్రమ ఎలా ఉంది..?
నేను అక్కడే పుట్టి పెరిగాను. అక్కడ వర్క్ కల్చర్ కి ఇక్కడికి చాలా తేడా ఉంది. నిజం చెప్పాలంటే తమిళ, మళయాళీ సినిమాలలో నటించాలనుకుంటున్నాను. ఆర్టిస్ట్ ఎప్పుడూ ఒకే చోట ఉండకూడదు.
జ్యోతిక స్నేహం నన్ను చెన్నై మీద మరింత ఇష్టాన్ని పెంచింది. తుమ్హారీ సులీ హిందీ సినిమా ను తమిళంలో రీమేక్ చేస్తున్నారు. నా పాత్ర షూటింగ్ కూడా దాదాపు కంప్లీట్ అయ్యింది. 
Q. మీ గురించి సోషల్ మీడియా లో వచ్చే కామెంట్స్.. మీ వరకూ వస్తాయా?
ఎందుకు రావండీ..? మా ఫ్రెండ్సే పంపిస్తారు. మొదట్లో ఇదేంటి అనుకునే దాన్ని. కానీ ఇప్పడు నేనూ నవ్వుకుంటున్నాను. ఒక మనిషిలో మంచి చూడాలంటే ఇప్పుడు చాలా కష్టం.
కామెంట్ చేయడం చాలా తేలిక. వీటిని పట్టించుకుంటే పనిచేయడం చాలాకష్టం. అందుకే వారి కామెంట్స్ ని సీరియస్ గా తీసుకోను.
Q. ఇండస్ట్రీ లో చాలా విషయాలు గుట్టుగా ఉండేవి.. కానీ ఇప్పడు అన్నీ రోడ్డు మీదకు వస్తున్నాయి..? మీ కామెంట్?
ఓపెన్ అవ్వడం మంచిదే. కానీ అందరినీ ఒకే తీరున చూడటం దారుణం. చికాగో సంఘటన అయినా, శ్రీ రెడ్డి అయినా పరిశ్రమ అనగానే భూతద్దంలో పెట్టి చూస్తారు. అందుకే విషయం పెద్దది అవుతుంది. ఇది అందరూ ఆలోచించాల్సిన సమయం.
ఇండస్ట్రీ లో కూడా మార్పు కనిపిస్తోంది. జూనియర్ ఆర్టిస్ట్ లతో మాట్లాడటం జరిగింది. వారి సమస్యలను పరిష్కరిస్తాం. ఛాంబర్ లో కంప్లైంట్ బాక్స్ కూడా పెట్టాం. 
Q. వైఫ్ ఆఫ్ రామ్ మీకు ఎలాంటి గుర్తింపును ఇస్తుందని మీ నమ్మకం?
దీక్ష పాత్ర చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఏదైనా సమస్యపై పోరాడాలనుకున్నప్పుడు ఆ పాత్ర ఒక స్ఫూర్తిగా నిలుస్తుందని నా నమ్మకం. నేను చాలా కొత్తగా కనిపిస్తాను. తప్పకుండా దీక్ష అందరికీ నచ్చుతుంది.
– కుమార్ శ్రీరామనేని