రెచ్చిపోతున్న ఇసుక మాఫియా.. లారీల్లో అక్రమ రవాణా..

పశ్చిమ గోదావరి జిల్లాలో ఇసుకు మాఫియా రెచ్చిపోతోంది. పోలవరం వద్ద ఇసుక అక్రమ దందా యధేచ్ఛగా కొనసాగుతోంది. ఇందుకు పోలీసులు, ఇరిగేషన్ శాఖ అధికారులు తమ పూర్తి సహాయ, సహకారాలు అందిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
గోదావరి నదికి వరద రావడంతో ఇసుకకు డిమాండ్ పెరిగింది. దీనిని సొమ్ముచేసుకోవాలనుకున్న కొందరు కాంట్రాక్టర్లు పోలవరం ప్రాజెక్టు అవసరాల కోసం నిల్వ చేసిన ఇసుకను లారీల్లో అక్రమ రవాణా చేస్తున్నారు.
పోలవరం ప్రాజెక్ట్ నుండి విశాఖ పట్నానికి ఇసుకను తరలిస్తున్నారు. ఇసుక మాఫియా విదిలిస్తున్న ఎంగిలి మెతుకులకు ఆశపడుతున్న కొందరు అధికారులు చూసీ చూడనట్లు వ్యహరిస్తున్నారు. లారీల కొద్ది ఇసుక చెక్ పోస్టులు దాటి వెళ్తున్నా కళ్లప్పగించి చూస్తున్నారు.
లారీల కొద్ది ఇసుక అక్రమంగా తరలిపోతున్నా అధికారులు పట్టించుకోక పోవడంతో స్థానికులే రంగంలోకి దిగారు. ఇసుక లారీలను అడ్డుకుని పోలీసుల సాయంతో ఇరిగేషన్ కార్యాలయానికి తరలించారు. అయితే అక్కడ ఇసుకను డంప్ చేసిన డ్రైవర్లు లారీలతో అక్కడి నుంచి ఉడాయించారు.
చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు.. లారీలు వెళ్లిపోతున్నా పట్టించుకోక పోవడంపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాలో పోలీసుల హస్తం ఉందని ఆరోపిస్తున్నారు. ఇసుక రవాణాకు వాడుతున్న లారీలన్నీ పోలవరం ప్రాజెక్టు పనులు నిర్వహిస్తున్న కంపెనీకి చెందినవిగా స్థానికులు చెబుతున్నారు.
పోలీసులు మాత్రం స్థానికుల ఆరోపణలను ఖండిస్తున్నారు. ఇరిగేషన్ అవసరాల కోసమే ఇసుకను తరలిస్తున్నారని చెబుతున్నారు. పోలీసుల ప్రకటనపై స్థానికులు మండి పడుతున్నారు. ఇరిగేషన్ అవసరాలకైతే స్థానికంగా ఉండే టిప్పర్లు ఉపయోగించకుండా.. ఇతర జిల్లాల నుంచి లారీలను తీసుకురావాల్సిన అవసరమేంటని ప్రశ్నిస్తున్నారు.
అంతేకాకుండా పోలవరం ప్రాజెక్ట్ కు సంబంధించిన ఐరన్ కూడా తరలిపోతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. అవినీతికి పాల్పడుతున్న పోలీసులు, చెక్‌పోస్టు అధికారులతో పాటు .. ఇసుక మాఫియా పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని పోలవరం వాసులు కోరుతున్నారు.