తొలకరి జల్లులతో పాటు వచ్చే తొలి పండుగ తొలిఏకాదశి

పిల్లలకి వేసవి సెలవులు అయిపోయి బడులు తెరిచినట్టుగానే దేవుళ్లు కూడా సెలవులు తీసుకుంటారేమో అందుకే దాదాపు రెండు నెలలు పండుగలు ఉండవు. తొలిఏకాదశి పండుగతో మళ్లీ పండుగలు, తెలుగు వాకిళ్లలో సందడులు మొదలవుతాయి. తొలిఏకాదశి అంటే మోక్షాన్ని ప్రసాదించే ఏకాదశి అని పేరు. కారణం శ్రీ మహావిష్ణువు ఈ రోజు యోగనిద్రలోకి జారుకుని జీవుల కర్మఫలాల గురించి ఆలోచిస్తుంటారు. నిద్ర నుంచి లేవగానే వారి వారి కర్మలననుసరించి మళ్లీ జన్మలు నిర్ణయిస్తారు. ఇది దేవుడి డ్యూటీ. మరి ఏకాదశి రోజు ప్రతి ఒక్కరూ ఆచరించవలసిన నియమాలు..
* బ్రహ్మీ ముహుర్తంలో నిద్ర లేవాలి. అంటే ఉదయం నాలుగ్గంటలకు ముందే నిద్ర లేచి స్నానపానాదులు ముగించి నిర్మలమైన మనస్సుతో భగవంతుడిని ఆరాధించాలి.
* ఎవరి శక్తి మేరకు వారు భగవంతునికి ధూప, దీప నైవేధ్యాలు సమర్పించాలి.
* సాయింత్రం కూడా దేవునికి దీపారాధన చేయాలి. అనంతరం భగవన్నామ స్మరణతో జాగారం చేయాలి. మర్నాటి ఉదయం సూర్యోదయానికి ముందే దేవునికి దీపారాధన చేసి ప్రసాదం స్వీకరించాలి.
ఎవరూ చూడట్లేదనకుని చేసే తప్పొప్పులను క్షమించమంటూ దేవుడిని మనస్ఫూర్తిగా వేడుకోవాలి. ఎవరినీ నొప్పించని మంచి మనసుని ప్రసాదించమని, శిక్షించడం కోసమే అయితే మరు జన్మ వద్దని మనసారా వేడుకుంటే దయామూర్తి తప్పక కరుణిస్తాడు.