చదువులమ్మ ఓడిలో చిన్నారుల వ్యథ

బాలికలు క్యూలో నిలబడింది కొత్త సినిమా టికెట్ల కోసం కాదు.. రేషన్ షాప్ లో క్యూ కాదు..దేవాలయంలో దేవుని దర్శనం కోసం కాదు.. భాగ్యలక్ష్మి బంపర్ డ్రా అంతకన్నా కాదు..చదువులమ్మ ఓడిలో చిన్నారులు పడుతున్న బాధలు. వీరి కష్టాలు చూస్తే ఎవరికయినా కన్నీళ్లు రావాల్సిందే.

ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లను తప్పనిసరిగా ఏర్పాటు చేయాల్సిందేనని భారత సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించినా వాటిని ప్రభుత్వాలు పట్టించుకున్న దాఖలాల్లేవు. ఇప్పటికీ చాలా పాఠశాలల్లో మరుగుదొడ్లు లేకపోవడమే ఇందుకు నిలువెత్తు నిదర్శనం.

మరుగుదొడ్లు ఉన్న కొన్నిచోట్ల నిధులు లేమితో నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు చెప్పుకోలేని వ్యథను అనుభవిస్తున్నారు. కనీస వసతులైన మరుగు దొడ్లు, మంచినీరు లేక నానా అవస్థలు పడుతున్నారు.

ముఖ్యంగా బాలికలు ఈ సమస్యతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గంటల తరబడి ‘వాటిని’ అదుపు చేసుకోవటం వల్ల వివిధ రకాల ఇన్‌ఫెక్షన్ల బారిన పడుతున్నారు.

సూర్యపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపాల్టీ పరిధిలో గల ప్రభుత్వ ప్రజా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల్లో విద్యార్థులు పడుతున్న బాధలు వర్ణనాతీతం.

తమ గారాలపట్టీలు పడుతున్న బాధలు చూసిన తల్లిదండ్రుల హృదయాలు తల్లడిల్లుతున్నాయి. ఉపాధ్యాయల వద్ద గోడు వెళ్లబోసుకున్నా ఫలితం లేకపోవడంతో వారు ఆవేదన చెందుతున్నారు.

ఈ పాఠశాల్లో 6 నుండి 10 వ తరగతి వరకు ఇంగ్లీష్,తెలుగు మీడియాలో విద్యా బోధన చేస్తున్నారు.
568 మంది విద్యార్థులు ఉన్న ఈ స్కూల్లో రెండు మాత్రమే బాత్రూమ్‌లు ఉన్నవి. ఈ రెండు బాత్ రూమ్‌లనే విద్యార్థినిలు వాడుకోవలసిన దౌర్భాగ్యం ఏర్పడింది.

కంపు వాసనతో పాటు బాత్రూమ్‌కు వెళ్లాలంటే గంటల తరబడి నిలబడి పోవలిసి వస్తుంది అని వాపోతున్నారు.

కడుపు ఉబ్బి పోయి అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి.. మా మోర అలకించే వారే లేరా.. బంగారు తెలంగాణ అని చెప్పుకునే ఈ రాష్ట్రంలో ప్రభుత్వ బడుల్లో ఆడ పిల్లల పరిస్థితి ఇలా ఉన్నదని పాలకులపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రజా ప్రతినిధులు, అధికారుల పిల్లలు మేము చదువుకునే బడిలో వాళ్ళ పిల్లలు చదివితే అప్పుడు మా బాధలు అయిన తెలుస్తాయి.మేము వారి పిల్లల లాంటి వారిమే మాకు ఎందుకు సదుపాయాలు కలిపించరు అని ప్రశ్నిస్తున్నారు.

దయచేసి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు అయిన బాత్రూమ్‌లు, తరగతి గదులు, కూర్చోవడానికి బల్లలు, తాగటానికి మంచి నీటిని ఏర్పాటు చేసి ప్రభుత్వ పాఠశాల్లో చదివే పేద పిల్లలను ఆదుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు.

-యలక సైదులు