గుడ్ న్యూస్.. ఇకపై వారానికి నాలుగు రోజులే ఆఫీస్..

వారంలో ఒకరోజు ఆదివారం సెలవు వచ్చిందటేనే సంతోషం. అయ్యో అప్పుడే ఆదివారం అయిపోయిందా అంటూ బాధ. సోమవారం ఆఫీస్‌కి వెళ్లాలంటే బద్దకం. మరి ఒక్క రోజు సెలవొస్తేనే ఇలా ఉంటే వారానికి ఏకంగా మూడు రోజులు సెలవొస్తే.. బద్దకం లేకుండా మరింత బాగా పనిచేస్తామంటున్నారు న్యూజీలాండ్ వాసులు. ఉద్యోగులకు పనిగంటలు తగ్గిస్తే మంచి అవుట్‌పుట్ ఇస్తారేమోనని ఆఫీస్‌లో బాస్‌కి వచ్చిన ఆలోచనను ఆచరణలో పెట్టారు. ప్రయోగం సక్సెస్ అవడంతో ఇదే విధానాన్ని అమలు పరచాలనుకుంటోంది ఇక్కడి పెర్పెట్యుయల్ గార్డియన్ కంపెనీ.
ఉద్యోగులు కుటుంబసభ్యులతో గడిపే అవకాశం ఇవ్వాలని భావించింది. అందులో భాగంగానే వారానికి నాలుగు రోజుల పనివిధానాన్ని ప్రవేశపెట్టింది. ఇందుకోసం మార్చి- ఏప్రిల్‌లో నిర్వహించిన ట్రయల్స్ విజయవంతమయ్యాయి. అలా అని పని గంటలు కూడా పెంచలేదు. ఎప్పటిలానే 8గంటల పని విధానాన్నే ఉంచింది. ఈ మార్పుతో ఉద్యోగులు మరింత బాగా పనిచేస్తున్నారు. కంపెనీ కూడా లాభాల బాట పయనిస్తోందని అధికారులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యం నిర్ణయంతో ఉద్యోగుల ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.