సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్దం

పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమైంది. బుధవారం జరగనున్న పార్లమెంటు ఎన్నికలకు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. పాకిస్తాన్‌ పార్లమెంటుతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల అసెంబ్లీలకు కూడా బుధవారమే ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం పది కోట్ల మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

మొత్తం 849 జనరల్‌ స్థానాలకు గాను పలు రాజకీయ పార్టీలు, స్వతంత్ర ఉద్యమ సంస్థల నుంచి.. 11వేల 855 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 272 జాతీయ అసెంబ్లీ స్థానాలకుగాను 3వేల 459 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మహిళా అభ్యర్థులకు 60 స్థానాలు, మైనార్టీలకు 10 స్థానాలు రిజర్వు చేశారు.

ప్రధాన మంత్రి పదవి కోసం పలువురు అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం ముగ్గురి మధ్యే జరగనుంది. పార్లమెంటులో ఏ పార్టీకి అయినా సాధారణ మెజారిటీ దక్కాలంటే కనీసం 172 స్థానాలు రావాలి. అత్యధిక స్థానాలు సాధించిన పార్టీకే తదుపరి ప్రధానమంత్రిని ఎన్నుకునే హక్కు వుంటుంది. మరోవైపు, పాక్ ఎన్నికలను భారత్ నిశితంగా పరిశీలిస్తోంది.