హామీలు నెరవేర్చలేక.. క్షమించమంటూ చేతులు జోడించి..-ఎమ్మెల్యే

అధికారం, ఆ పేరుతో వచ్చే సకల సౌకర్యాల కోసం ఎలక్షన్లలో నిలబడే వారు కొందరైతే, నాయకుడినైతే ప్రజల కష్టాలు తనవిగా చేసుకునే వాటిని పరిష్కరించడానికి అవకాశం ఉంటుందని ఎన్నికల్లో పోటీచేస్తుంటారు మరికొందరు. ఈ రెండో కోవకు చెందిన ఎమ్మెల్యే అసోం రాష్ట్రంలోని మరియాని నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రూప్ జ్యోతి కుర్మి. తండ్రి మాజీ మంత్రిగా పనిచేసి ప్రజలకు దగ్గరయ్యారు.
ట్రైబల్ తెగకు చెందిన కుర్మి తన నియోజకవర్గంలోని మహాత్మాగాంధీ మోడల్ హాస్పిటల్ సమస్యలను పరిష్కరించి ప్రజలకు మెరుగైన వైద్యసహాయం అందేలా చూస్తానని ఎన్నికలప్పుడు హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేగానే కాదు ఆ హాస్పిట్ మేనేజ్‌మెంట్ కమిటీకి అధ్యక్షుడిగానూ ఉన్న కుర్మి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి 8 మంది డాక్టర్లను కూడా నియమించారు. తాజా పర్యటనలో భాగంగా హాస్పిటల్‌ను సందర్శించిన కుర్మీకి అక్కడ ఒక్క డాక్టర్ కూడా కనిపించలేదు. పైగా రోగులను చూసుకునే మిగిలిన సిబ్బంది కూడా తక్కువగా ఉన్నారు.
వైద్య సేవలు సకాలంలో అందక రోగులు పడుతున్న అవస్థలు కళ్లారా చూసి చెలించిపోయిన కుర్మి వెంటనే ఈ విషయాన్ని ఆరోగ్య శాఖామంత్రి డాక్టర్ హిమంత బిస్వా శర్మకు కంప్లైంట్ చేశారు. స్పందించిన మంత్రి డ్యూటీకి రాని వైద్యుల ఒకరోజు జీతాన్ని కట్ చేయాలని అధికారులను ఆదేశించారు. రోగులకు సరైన వైద్య సదుపాయాలు అందించడంలో విఫలమైనందుకు ఎమ్మెల్యే కుర్మీ పేషెంట్ల ఎదుట మోకాళ్లపై నిల్చుని, చేతులు జోడించి క్షమాపణలు వేడుకున్నారు. నాయకుడు మంచోడైనా కింది స్థాయి ఉద్యోగులు కూడా సక్రమంగా పనిచేస్తేనే ప్రజలకు నాయకత్వంపై నమ్మకం బలపడుతుంది.