నవ్యాంధ్రను కష్టపడి నిర్మించుకుంటూ వస్తున్నాం : సీఎం చంద్రబాబు

నవ్యాంధ్రను కష్టపడి నిర్మించుకుంటూ వస్తున్నామని, ప్రజా సమస్యల పరిష్కారానికి కూడా అదే స్థాయిలో ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. వృద్ధిరేటులో ఆంధ్ర ప్రదేశ్ స్థిరంగా నెంబర్ వన్ గా నిలుస్తోందని, మూడేళ్లుగా వృద్ధిరేటు స్థిరంగా ఉందని చెప్పారు. అంతిమంగా అత్యధిక ప్రజల సంతృప్తే ముఖ్యమని వివరించారు. అన్ని శాఖల అధిపతులు, కార్యదర్శులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాలకు ప్రజల నుంచి నూరుశాతం సంతృప్తి రావాలని చెప్పారు. ప్రాధాన్యతా క్రమంలో అనుకున్నది చేయగలిగితే అనుకున్న ఫలితాలు వస్తాయన్నారు. ప్రభుత్వ అధికారులంతా గ్రామాలకు వెళ్లాల్సిందేనని, క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. నాలుగేళ్లలో రాష్ట్ర పరిస్థితిని ఎలా మార్చగలిగారో వివరించాలన్నారు. వచ్చే 115 రోజులు గ్రామదర్శిని కార్యక్రమాన్ని విస్తృతంగా ముందుకు తీసుకెళ్లాలన్నారు. బరువు తక్కువ శిశువులు పుట్టకుండా గర్భిణులకు పౌష్టికాహారం అందించాలని, గ్రామ స్థాయిలో సమస్యలు అక్కడికక్కడే పరిష్కారమయ్యేలా చూడాలని, అందరినీ ఒక చోట చేర్చి వాటిని ఎప్పటికప్పుడు కొలిక్కి తీసుకురావాలని సూచించారు.

వచ్చే 5 నెలల్లో 20 రోజులు, 10 నెలల్లో 40 రోజులు పాటు గ్రామాల్లో పర్యటించేలా శాఖాధిపతులు, సీనియర్ అధికారులు క్యాలెండర్ రూపొందించుకోవాలని సీఎం సూచించారు. 40 రోజుల్లో ఒక్కో అధికారి ఎన్ని గ్రామాల్లో పర్యటిస్తారో ప్రోగ్రాం తయారు చేయాలన్నారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు సీనియర్ అధికారులు ఒక్కసారైనా వెళ్లాలన్నారు. వచ్చే 150 రోజుల్లో ఎన్ని పనులు చేయగలరో అన్నీ చేయాలన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలు, అధికారుల సమన్వయంతో పనిచేయాలని ప్రజా సమస్యలు ఎక్కడికక్కడే పరిష్కరించాలన్నారు. ఐదు నెలల్లో క్షేత్ర స్థాయి పర్యటనలు పూర్తి చేసి విజన్ డాక్యుమెంట్ రూపొందించాలని ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్రంలో అర్హులందరికీ పెన్షన్లు, ఎన్టీఆర్ భరోసా ఇస్తున్నామని, ఈ మేరకు ప్రజల్లో కాన్ఫిడెన్స్ క్రియేట్ చేశామని చెప్పారు. అన్ని వర్గాలకు పెళ్లికానుకలు ఇస్తున్నామని, ఎస్టీ ఎస్సీల విద్యార్ధులకు సాయపడుతున్నట్లు వివరించారు. పేదల ఆకలి తీర్చేందుకు ప్రవేశపెట్టిన అన్న క్యాంటీన్లు అద్భుతంగా పనిచేస్తున్నాయన్న ముఖ్యమంత్రి.. నాణ్యమైన, రుచికరమైన ఆహారం అందిస్తున్నట్లు చెప్పారు.

ఇకపై ప్రధానంగా 10 సంక్షేమ కార్యక్రమాల మీద దృష్టిని కేంద్రీకరించాలని, విజయవంతంగా అమలు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. పౌర సరఫరాలు, చంద్రన్న బీమా, ఎన్టీఆర్ భరోసా, ఎన్టీఆర్ వైద్య సేవ, అన్న క్యాటీన్లు, ఎస్సీ ఎస్టీలకు లబ్ది, చంద్రన్న పెళ్లి కానుక, స్కాలర్ షిప్‌లను సింగిల్‌ విండో విధానం చేయడం ద్వారా వంద శాతం సంతృప్తి తీసుకు రావాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రతి జిల్లా యూనిట్‌గా తీసుకుని చేసిన అభిప్రాయ సేకరణలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 80శాతం సంతృప్తి వ్యక్తమైందన్నారు సీఎం. ప్రతీ శాఖ కార్యదర్శి, హెచ్‌వోడీలు నెలవారీ టార్గెట్ నిర్దేశించుకోవాలన్నారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.