నన్నే కాటేస్తావా.. ఉండు నీపని చెప్తా..

పామును చూడగానే పరిగెట్టడం ఖాయం. అలాంటిది ఆ పాముని పట్టుకుని బంధించి, తీరిగ్గా తీసుకువెళ్లి మెడికల్ సైన్సెస్ ల్యాబ్‌కి అప్పగించింది ఓ డేరింగ్ లేడీ. జార్ఖండ్‌లోని మనితా దేవి అనే మహిళ ఇంటి పెరట్లోని మొక్కలకు నీళ్లు పెడుతుంటే ఎక్కడినించి వచ్చిందో ఓ పాము ఆమెను కాటేసి వెంటనే వెళ్లి పోతుంది.

ఏదో కుట్టినట్టుగా అనిపించి వెనక్కి తిరిగి చూసుకునేసరికి చెట్ల గుబురులోకి వెళిపోతున్న పాము కనిపించింది. వెంటనే ఏ మాత్రం భయపడకుండా దాని తోకను పట్టుకుని బంధించింది మనితా దేవి. దాన్ని తీసుకుని ఓ డబ్బాలో ఉంచి పైకి రాకుండా బట్ట కట్టేసింది. ముందు పాము కరిచిన విషం శరీరంలోకి పాకకుండా ఆసుపత్రికి వెళ్లి ట్రీట్‌మెంట్ తీసుకుంది.

అపాయం ఏమీ లేదని డాక్టర్లు చెప్పిన తరువాత ఆ పాముని తీసుకుని రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)కు వెళ్లడంతో అక్కడి డాక్టర్లు షాక్ తిన్నారు. ఆ మహిళ ధైర్యానికి మెచ్చుకున్నారు. కానీ అన్ని పాములు ఒకలా ఉండవు. అవి విషసర్పాలు జాగ్రత్తగా ఉండడమే మంచిదంటూ ఆమెకు సలహా కూడా ఇచ్చారు. పాములతో చెలగాటం మంచిది కాదన్నారు.