భయపడ్డ నీరవ్‌ మోడీ మామ మెహల్‌ చోక్సీ

మెహల్‌ చోక్సీ.. గీతాంజలి జెమ్స్‌ ప్రమోటర్‌గా, నీరవ్‌ మోడీ మామగా, అతనితో కలిసి పీఎన్‌బీకి 13,400 కోట్లు కుచ్చుటోపీ పెట్టిన ”పెద్ద” మనిషిగా మనందరికీ సుపరిచితుడు. ఇతగాడు తనమీద పెట్టిన నాన్‌ బెయిలబుల్‌ కేసులను కొట్టేయాలని కోర్టులను ప్రాధేయపడ్డాడు. ఎందుకంటే, భారత్‌ కు తిరిగివస్తే, తనపై బాధితులు.. అప్పులోళ్లు ఎక్కడ మూకదాడి చేస్తారో అని భయమట! వినడానికి విచిత్రంగా ఉంది కదూ..! గత కొన్నాళ్లుగా మన దేశంలో ‘మూక దాడులు’ జరుగుతున్న విషయం మనకు తెలిసిందే! తమ పిల్లల్ని ఏదో చేస్తారని కొందరు, ‘గోరక్ష’ పేరుతో మరికొందరు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారు. జనంలో ఈ ప్రవృత్తి ఎందుకు ఇంతలా వ్యాపిస్తోంది అనేది ఆలోచిస్తే, కారణాలు అనేకం కనిపిస్తాయి.

తక్షణ న్యాయం కావాలని కొందరు, చట్టం-న్యాయ వ్యవస్థపై నమ్మకం సన్నగిల్లి మరికొందరు, తమ ఆధిపత్యం చూపించుకునేందుకు ఇంకొందరు.. ఇలా ఒక్కొక్కరూ ఒక్కో కారణంతో ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారు. ఇది కచ్చితంగా సమర్థనీయం కాదు. మరి, చోక్సీ లాంటి ‘ఉడాయించిన’ పెద్ద మనుషులు మన చట్టాలకు, న్యాయ వ్యవస్థలకు కూడా ఇంతలా భయపడలేదేం? ఎంతో పురాతనమైన చట్టాలు, కేసులకు తగ్గట్టుగా చాలీ చాలని కోర్టులు, ఏళ్లూ పూళ్లూ పట్టే కేసులు.. ఇవన్నీ చూస్తున్న జనం కడుపు మంట చల్లారేదెలా..? తమ దగ్గర లేదా తాము బ్యాంకుల్లో దాచుకున్న డబ్బును తీసుకుని, ఎగవేసి, ఎగిరిపోతున్న సో కాల్డ్‌ ‘పెద్ద’ మనుషుల్ని చూస్తే ఎవరికి మాత్రం కొట్టాలనిపించదు?

మరి, ఎవరికి వారు ఇలా ఇష్టమొచ్చినట్లు ‘మూక దాడులు’ చేయడం సమర్ధనీయం కాదు కదా? దీనిమీద నివేదిక ఇవ్వమని సుప్రీంకోర్టు కూడా కేంద్రాన్ని కోరింది. ఈ ‘లించింగ్స్‌’కి పరిష్కారమేంటి..? దుమ్ము పట్టిన చట్టాలను సవరించాలి. అన్ని విధాలా ప్రజలకు న్యాయ వ్యవస్థపై నమ్మకం కలిగించాలి. తప్పు చేసిన వారు తప్పించుకోలేరనే బలమైన సంకేతం పంపించాలి. అప్పుడు కానీ, ఈ తరహా ఘటనలు ఆగవు. అయితే, ఇంత పెద్ద ఎగవేతదారు ఈ దాడుల గురించి భయపడుతున్నాడంటే, ఎక్కడో ఓ మూల సామాన్యుడికి కాసింత సంతోషం! చట్టాలు చేయలేని పని మనం చేశాం అని! బట్‌, న్యాయ వ్యవస్థ పటిష్టంగా ఉంటే పరిస్థితి ఇంత దాకా వచ్చేది కాదనేది వాస్తవం. కథలో ట్విస్ట్‌ ఏంటంటే, భారత్‌ తిరిగివస్తే తనను చంపేస్తారని భయపడ్డ ఈ చోక్సీ మహానుభావుడు అల్రెడీ అమెరికా వదలి కరేబియన్‌ దీవిలోని ‘Antigua & Barbuda’ (ఎంటిగ్వా అండ్‌ బార్బుడా) అనే దేశానికి చెక్కేశాడట!

ఆ దేశంతో మనకు ‘నేరస్థుల అప్పగింత ఒప్పందం’ కూడా లేదట! ఆ దేశంలో జస్ట్‌ 2.7 కోట్ల పెట్టుబడి పెడితే చాలు, సిటిజన్‌ షిప్‌ని బంగారు పళ్లెంలో పెట్టి ఇస్తారట! మరి, ఇలాంటి గుంట నక్కల్ని మన ప్రభుత్వం ఎలా తిరిగి తెస్తుందో, వారికి శిక్షలు ఎప్పటికి పడతాయో అనేది మిలియన్‌ డాలర్ల కొశ్చన్‌. ఇదంతా చూస్తున్న కామన్‌ మ్యాన్‌కి.. తాము మూక దాడులు చేస్తే తప్పేముంది..? అనిపించక మానదు. తక్షణం ఆల్టర్నేట్‌ చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే! ఈ దాడులే తగిన పరిష్కారం అనే భావన ప్రజల్లో బలంగా ప్రబలితే, అది మొత్తం వ్యవస్థకే చేటు చేసే ప్రమాదం ఉంది..!!!

– సౌజన్య