తెలుగు రాష్ట్రాలపై.. జాతీయ పార్టీల అసలు వ్యూహం అదే!

2019 ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో జాతీయపార్టీల సత్తా ముందే తేలిపోయిందా? ప్రాంతీయపార్టీలు ఎన్నికల అనంతరం మద్దతు తెలుపుతాయన్న ధీమాతో జాతీయ పార్టీలు ఓ అంచనాకు వచ్చాయా? కాంగ్రెస్ బీజేపీ రాష్ట్ర నేతల సామర్ధ్యంపై అపనమ్మకంతో ఉన్న జాతీయ నాయకత్వం.. వీరిని పెద్దగా పట్టించుకోవడం లేదన్న వ్యాఖ్యలే పార్టీనేతల్లో వినిపిస్తున్నాయి. పార్లమెంట్ సాక్షిగా ప్రధాని మోడీ కేసీఆర్ పాలను మెచ్చుకోవడంతో ఆపార్టీ ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తోంది. 2019 ఎన్నికల్లో తమదే గెలుపనే ధీమాను వ్యక్తం చేస్తోంది. ప్రధాని మోడీ స్వయంగా చంద్రబాబును ఆత్మరక్షణలో పడేసేందుకు చేసిన వ్యాఖ్యలు.. రాష్ట్ర బీజేపీ నాయకత్వాన్ని సందిగ్దంలో పడేశాయి.

తెలంగాణలో టీఆర్ఎస్ పాలన కుటుంబపాలనగా మారిందన్న ఆరోపణలున్నాయి. మిషన్ భగీరథ, కాకతీయ, ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో అవినీతి పేరుకుపోయిందంటూ.. రాష్ట్ర బీజేపీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. అయితే కేంద్రమంత్రులు మాత్రం ఈ పథకాలన్నీ బాగున్నాయంటూ కితాబిస్తున్నారు. దీంతో రాష్ట్ర బీజేపీ నేతల ఆరోపణలు.. కేంద్రమంత్రుల ప్రకటనలతో నీరుగారిపోతున్నాయి. రాష్ట్రంలో ఐదుగురు ఎమ్మెల్యేలున్న బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు తమ వ్యూహాలు తమకు ఉన్నాయని చెప్పుకుంటోంది. కాని రాష్ట్ర నేతలకు కేంద్రమంత్రుల ప్రకటనలు శరాఘాతంగా మారాయి. ఇక స్వయంగా నరేందమోడీయే కేసీఆర్ పాలన భేష్ అని మెచ్చుకోవడంతో.. ఇటీవల బీజేపీ బస్సుయాత్ర వల్ల క్యాడర్ లో వచ్చిన కాస్త జోష్ బూడిదలో పోసిన పన్నీరైపోయింది. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ప్రధాన ప్రత్యర్ధి కాంగ్రెస్ పార్టీ అని, బీజేపీ ప్రస్తుతానికి టీఆర్ఎస్ ను ఢీకొట్టే స్ధితిలో లేదని బీజేపీ అధిష్టానం గ్రహించింది. అందుకే కేసీఆర్ ను బలపరిచే పనిలో పడ్డారు. 2019లో అత్యధిక స్థానాలు గెలిస్తే.. కేంద్రంలో తమకు అవసరమైతే సహకరిస్తారన్న నమ్మకంతో మోడీ అండ్ టీం ఉంది. కాంగ్రెస్ ముక్త్ భారత్ లో భాగంగా అవసరమైతే టీఆర్ఎస్ కు సహకరించేందుకు.. బీజేపీ లోపాయకార ఒప్పందం చేసుకుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

అటు ఏపీ పరిస్థితి చూస్తే.. ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వెళ్లడంతో కొత్త మిత్రులను వెతుకునే పనిలో పడింది బీజేపీ అధిష్టానం. వైసీపీ, జనసేన పార్టీలు 2019 లో తమతో కలిసివస్తాయని.. పోస్ట్ అలయెన్స్ లో కచ్చితంగా సహకరిస్తాయన్న నమ్మకంతో బీజేపీ అధిష్టానం ఉంది. ఇప్పటికే స్పెషల్ స్టేటస్ ఎవరిస్తే వారికే తమ మద్దతు ఉంటుందని చెబుతున్న జగన్.. అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ రెండింటికి మద్దతు కోసం.. స్టేటస్ ను ముడిపెట్టారు. టీడీపీని నిలువరించడానికి పరోక్షంగా వైసీపీ, జనసేనలకు సహకరించడానికీ సిద్దంగా ఉంది. పార్లమెంట్ లో వైసీపీ మాయలో పడి టీడీపీ స్పెషల్ స్టేటస్ అడుగుతోందని స్వయంగా మోడీ చెప్పడంతో.. ఇది వైసీపీకి ప్లస్ అయిందనే చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీ ఎటూ ఏపీలో ఇప్పట్లో ప్రజల మద్దతు కూడగట్టుకునేలా కనిపించడంలేదు. రాష్ట్రాన్ని విడగొట్టారన్న కసి ఇంకా ఏపీ ప్రజల్లో ఉంది. సో, అక్కడ త్రిముఖ పోరు లో టీడీపీ, వైసీపీ, జనసేన కు వచ్చే పార్లమెంట్ సీట్లన్నీ కేంద్రంలో పాలన సాగించే పార్టీకే దన్నుగా నిలుస్తాయి. చంద్రబాబు సైతం ఇప్పటికీ తమకు మిత్రుడే అన్న సంకేతాలను రాజ్ నాధ్ లాంటి నేత అనడం భవిష్యత్తు ను దృష్టిలో పెట్టుకొనే అని చెప్పవచ్చు.

ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే .. తెలంగాణ ఇఛ్చిన పార్టీగా తెలంగాణ ప్రజలు 2019లో తమకు పట్టం కడతారన్న నమ్మకంతో ఉంది. అయితే పార్టీలో సీనియర్ల మధ్య ఉన్న అనైక్యత.. అందరూ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి పోటీపడేవారు కావడం.. ఆపార్టీకి మైనస్ గా మారిందని చెప్పవచ్చు. ఇటీవల రాహూల్ గాంధీ నేతృత్వంలో ఏర్పడిన సీడబ్య్లూసీలో ఒక్కరికీ చోటు కల్పించకపోవడంతో.. జాతీయ నాయకత్వం.. రాష్ట్రనేతలను ఏవిధంగా చూస్తోందో అందరికీ అర్థమైంది. తెలంగాణ ఇచ్చినప్పటికీ అధికారంలోకి తీసుకురావడంతో విఫలమయ్యారు. రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ను కష్టాల్లోకి నెట్టారన్న భావన జాతీయ నాయకత్వంలో ఉంది. మరోవైపు ఏపీ స్పెషల్ స్టేటస్ కు తమ పూర్తి మద్దతు ఉంటుందని కాంగ్రెస్ జాతీయ నాయకత్వం చెప్పుతుండడంతో.. దీనినే టీఆర్ఎస్ తన అస్త్రంగా మార్చుకోబోతోంది. ఏపీకి పన్ను రాయితీలు ఇస్తే తెలంగాణలో పరిశ్రమలు ఏపీకి తరలివెళ్తాయన్న ప్రచారాన్ని మొదలుపెట్టింది. సో, ఇది ఇక్కడి కాంగ్రెస్ నేతలకు ఇబ్బందిగా మారింది.

మొత్తానికి టీడీపీ, వైసీపీ, టీఆర్ఎస్, కొత్త పార్టీ జనసేన.. వీటిలో ఎవరు ఎన్ని సీట్లు సాధించినా.. 2019లో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే పార్టీకే మద్దతు ఇవ్వాలి. ఇది ఖాయంగా కనిపిస్తోంది. అందుకే రెండు జాతీయపార్టీలు సైతం.. ఈ ప్రాంతీయ పార్టీల విషయంలో ఆచితూచి స్పందిస్తున్నాయి.

– మార్గం శ్రీనివాస్