ఆ నియోజకవర్గం దశాబ్దాలుగా టీడీపీకి కంచుకోట.. కానీ..

tuni politics

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆ నియోజకవర్గంలో వార్ వన్ సైడ్. తమ్ముళ్లకు కంచుకోటయ్యింది. అంతకుముందు కూడా ఓ కుటుంబమే దశాబ్దాలు శాసించింది. పరిస్థితుల ప్రభావమో… ప్రజల మనోభావాల అభీష్టమో రెండు దపాలుగా ఇక్కడ ఏ పార్టీకి పట్టు చిక్కడం లేదు. గెలిచినవాళ్లు మళ్లీ గెలవడం లేదు. అదే తుని నియోజకవవర్గం. మరి కొత్త ఒరవడే కొనసాగుతుందా? లేక పాతకాపులకే పట్టం కడతారా.?

1955లో ఏర్పడింది తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గం. మూడు సార్లు వి.వి క్రిష్ణంరాజు బహదూర్ ఎమ్మెల్యేగా చేస్తే తరువాత రెండుసార్లు విజలక్ష్మీదేవి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. 1983 వరకు ఆ కుటుంబానిదే ఆధిపత్యం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో సీను మారిపోయింది. 28యేళ్ల పాటు యనమల రామక్రుష్ణుడు ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో యనమలకు పరాజయం తప్పలేదు. కాంగ్రెస్ అభ్యర్ధి వెంకట క్రిష్ణంరాజుని గెలిపించారు. 2014లో వైసీపీ అభ్యర్ధి దాడిశెట్టి రాజా విజయం సాధించారు.

2019 ఎన్నికలపై నియోజకవర్గంలో ఆసక్తికర చర్చ సాగుతోంది. తుని నియోజకవర్గంలో కోటనందూరు, తుని , తొండంగి మండలాలున్నాయి. తొండంగిలో బీసీలు అధికంగా ఉన్నారు. తునిలో కాపు ఓటర్లు ఎక్కువ. కోటనందూరులో వెలమలతో పాటు మిగిలిన సామాజికవర్గాల ప్రభావం ఉంటుంది. 2014లో మొదటిసారిగా కాపు సామాజిక వర్గానికి చెందిన దాడిశెట్టి రాజాకు వైసీపీ సీటు ఇచ్చింది. విజయం సాధించింది. అయితే ఈ సారి ఆయనకు పరిస్థితులు అంత మెరుగ్గా కనిపించడం లేదు. తునిలో అనుకూలంగా ఉన్నా.. మిగిలిన మండలాల్లో ఆయన పట్ల వ్యతిరేకత పెరుగుతోంది. మరోవైపు గతంలో రాష్ట్ర పార్టీకి పరిమితం అయి.. నియోజకవర్గం అభివృద్ధి మరిచిపోయారన్న ముద్ర ఉన్న యనమల రామకృష్ణుడు ఈసారి దృష్టి సారించారు. మంత్రిహోదాలో ఉన్న యనమల అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేశారు. ప్రజల్లో కూడా సానుభూతి వస్తోంది. యనమల కూతురు, లేదా ఆయన సోదరుడు కృష్ణుడులలో ఒకరు పోటీచేసే అవకాశం ఉంది. అయితే వైసీపీ-టీడీపీ మధ్యనే కాదు.. ఈసారి మూడో వ్యక్తి కూడా రంగంలో దిగుతున్నారు. గతంలో ఆ నియోజక వర్గంలో ఎంతో కొంత అభివృద్ది చేశారన్న మంచిపేరు తెచ్చుకున్న మాజీ ఎమ్మెల్యే క్రిష్ణంరాజు లేదా ఆయన వారసుడు జనసేన తరపున పోటీకి సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది. 2009లో తుని నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచిన కృష్ణంరాజు ఐదేళ్లు తుని అభివృద్దితో కీలకపాత్ర పోషించారు. నియోజకవర్గంలో కొంచెం పేరున్న వ్యక్తి కావడంతో అశోక్ బాబు ను జనసేన సంప్రదించింది. దాదాపు సీటు కన్ఫమ్ అని పరిస్థితిని ఆ పార్టీ ప్రచారం చేసుకుంది. కానీ కొన్ని రోజులుగా పరిస్థితులు మారుతున్నాయి. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ లోకి రావడంతో ఆయన ఆలోచనలో పడినట్టు తెలుస్తోంది. జెండా, ఎజెండా లేని జనసేనతో కంటే ఎంతో కొంత పార్టీ కలర్ ఉన్న జెండాపై పోటీ చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఏ పార్టీ నుంచి చేసినా.. ఇక్కడ త్రిముఖ పోరు ఖాయంగా కనిపిస్తోంది. తుని నియోజకవర్గంలో దాడిశెట్టి రాజాకు ముందు వరకు అధికారాన్ని రెండే కుటుంబాలు పంచుకున్నాయి. క్రిష్ణంరాజు కుటుంబం.. యనమల కుటుంబం. ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే దాడిశెట్టి ఆ రెండు కుటుంబాలతో పోటీ పడుతున్నారు. మరి ప్రజలు ఎవరికి మద్దతు ఇస్తారో చూడాలి.