వనితా వందనం.. మహిళల్ని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే..

పార్లమెంట్‌లో కన్నుకొట్టి రాహుల్ తప్పుచేశారా? ఆ నిర్లక్ష్యం ఖరీదు ప్రధానమంత్రి పోస్టా? కాంగ్రెస్‌లో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ప్రధాని అభ్యర్థిగా రాహుల్‌ను సైడ్‌ చేసేందుకు సై అంటున్నారు. మరి, ఆ స్థానం‌లోకి ఎవరొస్తారు? మహిళకు పట్టం కట్టబోతున్నారా.?

మోడీ మేజిక్కుల్ని తట్టుకోలేనని రాహుల్‌ నిరూపించుకున్నారు. పార్లమెంట్‌లో అవిశ్వాసంపై చర్చ సందర్భంగా ఓ రేంజ్‌లో ప్రసంగించిన కాంగ్రెస్ అధ్యక్షుడు.. చివర్లో పాలపొంగులా తుస్సుమన్నారు. ప్రధానిని కౌగిలించుకునే వరకు ఓకే అయినా.. చివర్లో కన్నుగీటి సెల్ఫ్‌గోల్‌ చేసుకున్నారాయన.

వచ్చే ఎన్నికల్లో UPAకు ఆధిక్యం వస్తే.. తానే ప్రధానమంత్రి అని రాహుల్‌ సొంత డబ్బా కొట్టుకున్నారా? ఎందుకంటే.. ఇప్పుడా కూటమిలో కుంపట్లు తారస్థాయికి చేరాయి. రాజకీయంగా పరిణతి సాధించని రాహుల్‌ను ముందు పెట్టుకుని ఎన్నికలకు వెళ్తే ఓట్లు రాలవని.. మోడీ-అమిత్‌షా జోడీ వ్యూహాల్ని ఎదుర్కోవాలంటే ఇంకేదో సంథింగ్ చేయాలనే మథనం ప్రారంభమైంది.అలా.. కొత్తపేర్లు తెరపైకి వస్తున్నాయి.

మహిళల్ని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే.. బెటరనే వాదనకు దాదాపు అంగీకారం కుదిరినట్టు చెప్తున్నారు. అలా తెరపైకి వస్తున్నారు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. యూపీ మాజీ సీఎం మాయావతి!

ఆరెస్సెస్‌ బ్యాక్ గ్రౌండ్‌ లేని ఎవ్వరికైనా మద్దతిస్తామన్నది కాంగ్రెస్‌ బంపర్‌ ఆఫర్. వ్యూహాత్మకంగా మహిళల్ని తెరపైకి తెచ్చారు. ఒకప్పుడు ప్రధాని పదవిని సోనియా త్యాగం చేశానని చెప్పుకునే కాంగ్రెస్‌.. మరోసారి మహిళను తెరపైకి తేవడం ద్వారా ప్రజలకు చరిత్రను గుర్తుచేసి, సానుభూతి పొందాలని చూస్తోంది. కాంగ్రెస్‌ కండిషన్స్‌ ప్రకారం మమత, మాయ పేర్లు తెరపైకి వచ్చాయి. వీళ్లలో మాయావతి UPA భాగస్వామి. ఉత్తరప్రదేశ్‌లో మహా కూటమిలో ఇమిడిపోయారు. మమతా బెనర్జీ విషయానికి వస్తే.. ఆమె చూపంతా మూడో కూటమిపైనే. అంటే.. ప్రధాని కుర్చీని టార్గెట్ చేశారామె.

మొన్నటి అవిశ్వాస తీర్మానంలో విపక్షాల బలం ఎంతో తెలిసిపోయింది. పంజాబ్, కర్నాటక మినహాయిస్తే ఈ నాలుగేళ్లలో ఒక్కో రాష్ట్రాన్ని కోల్పోతూ నిస్తేజంగా మారిన కాంగ్రెస్‌.. ఇప్పటికిప్పుడు పుంజుకునే సూచనలు కనుచూపుమేరలో లేవు. రాహుల్‌ ఏదో చేయగలరనే ఆశలు రోజురోజుకు అడుగంటుతున్నాయి.

ఈ నేపథ్యంలో అధికారం కోసం మరో ఐదేళ్లు ఎదురుచూసే దుస్థితి రాకుండా UPA చైర్‌పర్సన్‌ కొత్త స్ట్రాటజీని తెరపైకి తెచ్చినట్టు కనిపిస్తోంది. మైనార్టీలకు తామే అండ అని చెప్పుకుని.. ఓట్లు చీలకుండా ఉండేందుకే ఆరెస్సెస్‌ పదం వాడినట్టూ చెప్తున్నారు. బీజేపీని మినహాయిస్తే.. సంఘ్ పరివారం ఇతర పార్టీల్లో లేరు. ఉన్నా.. ఒకరిద్దరి జంపింగ్ జపాంగ్‌లే! వాళ్లకు ప్రధాని కుర్చీకి పోటీ పడే స్థాయి లేదు. అలాంటప్పుడు ఆరెస్సెస్‌ బ్యాక్ గ్రౌండ్‌లేని లీడర్‌ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించేందుకు అభ్యంతరం లేదని చెప్పడంలో ఆంతర్యం ఇదేనా?

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -