సైకోగా మారిన జవాన్.. యువతిపై అత్యాచారయత్నం

దేశ రక్షణకు కాపలా కాయాల్సిన ఓ జవాను సైకోగా మారాడు. భద్రత కల్పించాలి అనే బాధ్యతను గాలికి వదిలేసి అతనే ఘాతుకానికి తెగబడ్డాడు. ప్రేమ జంటలే లక్ష్యంగా యువతులపై అత్యాచారయత్నానికి ఒడిగడుతున్నాడు. ఈనెల 23 సికింద్రాబాద్ తిరుమలగిరిలో జరిగిన ఘటనతో ఆర్మీ జవాన్ బ్రిజేష్ కుమార్ నేర స్వభావం బయటపడింది.

బీహార్‌కు చెందిన జవాన్ బ్రిజేష్ కుమార్ ఏడాదిన్నరగా సికింద్రాబాద్ లో సిపాయిగా పని చేస్తున్నాడు. నేరేడ్‌మెట్ లో నివాసముంటున్న ఇతను..నిత్యం తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వే ట్రాక్ సమీపంలో తిష్టవేస్తుండే వాడు. అక్కడికి వచ్చే ప్రేమజంటలను టార్గెట్ చేసేవాడు. నిర్మానుష్య ప్రాంతంలో ఉన్న ప్రేమజంటలపై దాడి చేసి యువతులపై ఆత్యాచారానికి పాల్పడేవాడు.

ఈనెల 23న అక్కడికి వచ్చిన ఓ ప్రేమజంటపై దాడికి తెగబడ్డాడు. యువకుడిని కొట్టి,యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఆర్తనాధాలతో అక్కడే గస్తీకాస్తున్న తిరుమలగిరి పోలీసులు అక్కడికి వెళ్లి బ్రిజేష్ ను అదుపులోకి తీసుకున్నారు.

తిరుమలగిరి రైల్వై ట్రాక్ ప్రాంతంలో గత ఏడాది ఇలాంటి ఘటనే జరిగింది. ఆర్మీ మాజీ అధికారి కూతురు మైనర్ బాలికపై విచక్షణారహితంగా దాడి చేసి పారిపోయాడు. సృహ తప్పి పడిపోయిన బాలికను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాధితురాలి ఫిర్యాదుతో అప్పుడు పోలీసులు ఎంత గాలించిన నిందితుడు దొరకలేదు.

సరిగ్గా ఇప్పుడు అలాంటి ఘటనే జరగడంతో పోలీసులకు బ్రిజేష్ పై అనుమానం కలిగింది. మొదట అతను ఒప్పుకోకపోయినా పోలీసులకు అసలు విషయం తెలిసింది. గత డిసెంబర్ నాటి ఆధారాలు.. బ్రిజేష్ కుమార్ కు సరిగా పోలి ఉండడంతో అతడినే నిందితుడిగా తేల్చారు. నిందితుడిపై కేసు నమోదు చేసి డిమాండ్ కు తరలించారు. ఈ వ్యవహారంపై ఆర్మీకి అధికారిక సమాచారం ఇస్తామని పోలీసులు తెలిపారు.