యూట్యూబ్‌లో చూసి.. ప్రాణాల మీదకు..

నెట్టిల్లు నట్టింట్లోకి వచ్చింది. యూట్యూబ్‌లో చూసి చాలా నేర్చుకోవచ్చు. వంటా వార్పు దగ్గర్నుంచి, కుట్లూ అల్లికలూ, నాట్యం, సంగీతం ఇలా చాలానే చేసేస్తున్నారు ఆసక్తి ఉన్నప్రతి ఒక్కరూ. చేతిలో స్మార్ట్ ‌ఫోన్ ఉంది కదా అని ఏది పడితే అది చూసేసి చేస్తామంటే కుదరదు. కొన్ని వీడియోలు ప్రాణాలకే ప్రమాదం తెచ్చి పెడతాయి. అవి కేవలం అవగాహన కోసం మాత్రమే పెడతారు. వాటితోనే పని కానిస్తామంటే ప్రాణాలకు ముప్పు తప్పదు.

తమిళనాడు తిరుపూర్ ప్రాంతానికి చెందిన ప్రైవేట్ స్కూల్ టీచర్ కృతిక గర్భం దాల్చింది. ఆమె భర్త ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుంటాడు. వీరికి ఇంతకు ముందే మూడేళ్ల పాప ఉంది. ఇప్పుడు మరోసారి గర్భం దాల్చింది. భార్యా భర్తలు ఇద్దరికీ యూట్యూబ్ చూసే అలవాటు ఉంది. ఈ క్రమంలోనే నెలలు నిండిన తరువాత డెలివరీ ఎలా అవుతుంది అనే విషయాన్ని యూట్యూబ్‌లో చూసి తెలుసుకున్నారు. అదే పద్ధతిని ప్రయోగించారు భార్యా భర్తలు ఎవరి సహాయం తీసుకోకుండా, ఆసుపత్రికి వెళ్లకుండా. అది కాస్తా వికటించింది.

కడుపులోని బిడ్డ బయటకు అయితే వచ్చింది కానీ కృతికకు తీవ్ర రక్తస్రావం అయింది. దీంతో కంగారు పడిన భర్త హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. అప్పటికే ఆలస్యం జరిగిపోయింది. వైద్యుల ప్రయత్నం ఫలించలేదు. కృతిక ప్రాణాలు కోల్పోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు భర్తను అరెస్టు చేసి విచారిస్తున్నారు. అనవసర ప్రయత్నాలతో ఇద్దరు బిడ్డల్ని తల్లి లేని అనాధలను చేసిందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు.