విద్యార్థి ఆత్మహత్యకు మాకు ఏంటి సంబంధం – స్కూల్ యాజమాన్యం

ముషీరాబాద్ లో ఏడో తరగతి విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపుతోంది. ఫీజు కట్టలేదని స్కూల్ యాజమాన్యం వేధించడంతోనే.. తమ కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అయితే, స్కూల్ యాజమాన్యం మాత్రం విద్యార్థి ఆత్మహత్యకు, తమకు ఎలాంటి సంబంధం లేదని చెబుతోంది.

సికింద్రాబాద్ లోని ముషీరాబాద్‌లో మహేష్ అనే విద్యార్థి సూసైడ్ చేసుకోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. కవాడీగూడా లిటిల్‌ ఫ్లవర్‌ స్కూల్లో మహేష్ ఏడో తరగతి చదువుతున్నాడు. పద్మశాలి కాలనీకి చెందిన అతను, ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఫీజు కట్టలేదని స్కూల్ యాజమాన్యం వేధించడంతోనే తమ కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ కొడుకు ఇక లేడని తెలిసి కన్నీరు మున్నీరయ్యారు.

విద్యార్థి పెరేంట్స్ చేస్తున్న ఆరోపణలు అవాస్తవం అంటోంది స్కూల్ యాజమాన్యం. ఆత్మహత్య చేసుకున్న మహేష్.. గత రెండు రోజుల నుంచి స్కూల్ కే రావడం లేదని చెబుతున్నారు. అంతేకాదు, దీనికి సంబంధించిన ఆధారాలను పోలీసులకు అందించామని చెబుతున్నారు. ఆత్మహత్య విషయం కూడా మహేష్ తల్లిదండ్రులు చెబితేనే తమకు తెలిసిందన్నారు.

ఫీజు కట్టలేదని ఇంటికి పంపించడంతో.. మనస్థాపానికి గురైన మహేష్ ఆత్మహత్య చేసుకున్నాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

విద్యార్ధి బందువులతో పాటు పలు విద్యార్ధి సంఘాలు లిటిల్ ఫ్లవర్ స్కూల్ వద్ద ఆందోళనకు దిగాయి.

అయితే, స్కూల్ యాజమాన్యం మాత్రం ఫీజు విషయంలో తాము ఎప్పుడు ఒత్తిడి చేయాలేదని అంటున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు, విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.