దారుణం.. విద్యార్థులను భయపెట్టి లైంగిక వాంఛలు తీర్చుకున్న టీచర్‌!

హైదరాబాద్ రాంనగర్ హైస్కూల్‌లో దారుణం చోటు చేసుకుంది. టీచర్‌గా ఉండి.. ఉపాధ్యాయ వృత్తికే కళంకం తెచ్చాడు. రాంనగర్ ప్రభుత్వ హైస్కూల్ ఇన్‌ఛార్జ్ అయిన రాజు.. విద్యార్థులకు మార్కులు తక్కువగా వేస్తానని భయపెట్టి తన లైంగిక వాంఛలు తీర్చుకునేవాడు.

బడికి వచ్చే మగ పిల్లలనే టార్గెట్ చేసుకున్నాడు రాజు. తాకరాని చోట విద్యార్థులను తాకి, వికృత చేష్టలకు పాల్పడేవాడు. లైంగిక వాంఛలు తీర్చుకునేందుకు స్కూల్‌లోని తన క్యాబిన్‌నే అడ్డాగా మార్చుకున్నాడు. రోజుకో విద్యార్థి అతని కామ వికృత క్రీడలకు బలిచేసేవాడు. ఈ విషయాన్ని బయటకు చెప్పుకోలేక తమలో తామే బాధపడేవారు విద్యార్థులు.

రోజువారీ చర్యల్లో భాగంగా ఓ బాలుడుని రాజు ఇలాగే భయపెట్టాడు. వికృతంగా ప్రవర్తించాడు. దీంతో ఏడో తరగతి చదివే ఆ విద్యార్థి స్కూల్‌కు వెళ్లాలంటే వణికిపోయేవాడు. ఏమైందని విద్యార్థి తల్లిదండ్రులు గట్టిగా అడిగే సరికి అసలు విషయం బయటపెట్టాడు. దీంతో టీచర్ రాజు పాపం పండింది. రాజు వికృతచేష్టలకు ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులు బలయ్యారు.

విషయం తెలియగానే పిల్లల పేరెంట్స్ స్కూల్‌కు వెళ్లి రాజు వీపు విమానం మోత మోగించారు. దేహశుద్ధి చేసి ముషీరాబాద్ పోలీసులకు అప్పగించారు. విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ కొరవడడంతోనే దారుణం చోటు చేసుకుందని తల్లిదండ్రులు వాపోయారు.