ఏపీ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారిన జగన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు!

ప్రతిపక్ష నేత జగన్‌ డిప్రెషన్‌లో ఉన్నారా?. జనంలో నమ్మకం కోల్పోయానన్న ఆవేదనతోనే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారా అంటే అవుననే అంటున్నారు ఏపీ మంత్రులు. పవన్‌కల్యాణ్‌పై జగన్‌ తిట్ల దండకాన్ని తప్పుబట్టారు. రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలకు తావులేదంటూ ప్రతిపక్ష నేతకు హితవు పలికారు.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ వ్యక్తిగత జీవితంపై… జగన్‌ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారాయి. ప్రతిపక్ష హోదాలో ఉన్న వ్యక్తి చౌకబారు వ్యాఖ్యలు చేసి జనంలో పదేపదే చులకనవుతున్నారంటూ.. వైసీపీ నేతలు కలవరపడుతున్నారు. పార్టీ అధినేత చేసే వివాదాస్పద వ్యాఖ్యలను సమర్థించడానికి.. నానా పాట్లు పడుతున్నారు. జగన్‌ గతంలో కూడా చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కొన్నారు.

పవన్‌కల్యాణ్‌ పర్సనల్‌ లైఫ్‌ని టచ్‌ చేసిన జగన్‌.. రాజకీయ ప్రత్యర్థులకు అడ్డంగా దొరికిపోయారు. వైసీపీ అధినేతకు.. ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావ్‌ చురకలంటించారు. వ్యక్తిగత ఆరోపణలతో రాజకీయం చేస్తే అది కాలక్షేపంగా మారుతుందని.. దానివల్ల ఎవరికీ ఉపయోగం ఉండదని సూచించారు. ప్రజలు విశ్వసించడం లేదన్న బాధతోనే.. జగన్‌ ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

పవన్‌ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడటం సరికాదని.. జగన్‌ ఈ తరహాలో వ్యాఖ్యలు చేస్తారని ఊహించలేదని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. రాజకీయ పోరాటం ఉండాలే తప్ప వ్యక్తిగత విమర్శలకు దిగడం సరికాదన్నారు. జగన్‌ డిప్రెషన్‌లో ఉన్నట్లు ఈ విమర్శలతో అర్థమయిపోయిందన్నారు.

మరోవైపు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన జగన్‌ను… మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తప్పుబట్టారు. అలాంటి విమర్శలు చేసే హక్కు జగన్‌కు లేదన్నారు. పవన్ విషయంలో ఆయన సతీమణులే తేల్చుకోవాలని.. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇరు వర్గాలకు మంచిది కాదని సూచించారు.

ఏదేమైనా ప్రస్తుతం జగన్ చేసిన వ్యాఖ్యలు ఏపీ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇప్పుడే ఇలా ఉంటే.. ఇక ఎన్నికల ప్రచార వేళ ఏపీ పాలిటిక్స్‌లో మరింత వేడి రాజుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.